కపిల్ దేవ్‌కు గుండెపోటు

1983 ప్రపంచ కప్‌లో భారత్‌ను ముందుండి నడిపించిన దిగ్గజ క్రికెట్ జట్టు కెప్టెన్, ఆల్ రౌండర్ కపిల్ దేవ్‌కు శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఢిల్లీలోని ఫోర్టిస్ ఆస్పత్రికి తరలించారు.

అక్కడ ఆయనకు యాంజియోప్లాస్టీ చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు ఇప్పటికే డయాబెటీస్ సంబంధ ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఆయన ఇటీవల టీ20 లీగ్ పై పలు కామెంట్లు చేస్తూ యాక్టివ్ గా కనిపించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. 

కపిల్ కు గుండెపోటు వచ్చిందని తెలియగానే ఆయన అభిమానులతో పాటు, క్రికెట్ ప్రపంచం షాక్ కు గురైంది. హర్యానా హరికేన్‌గా పేరొందిన కపిల్‌ టీమిండియాకు తొలిసారి వరల్డ్ కప్ అందించిన కెప్టెన్ గా కపిల్ దేవ్ చరిత్రలో నిలిచిపోయారు.

ఆయన సారథ్యంలోనే 1983లో తొలిసారి టీమిండియా వరల్డ్ కప్ టైటిల్ సాధించిన సంగతి తెలిసిందే. వెస్టిండీస్ పై కపిల్ దేవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ భారత్ కు కప్ తెచ్చిపెట్టింది.   కపిల్‌ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖలు సోషల్‌ మీడియా వేదికగా ట్వీట్‌ చేస్తున్నారు.

 బ్యాటింగ్, బౌలింగ్‌లో కపిల్ ఆకట్టుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో మొత్తం 131 టెస్టులు, 225 వన్డేలు ఆడిన కపిల్… 9000కు పైగా పరుగులు చేశారు. అంతేగాక టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా కూడా రికార్డు సాధించారు.