దుబ్బాకలో అక్రమ కేసులతో బిజెపిని అడ్డుకోలేరు 

దుబ్బాకలో అక్రమ కేసులో అధికార పక్షం బిజెపి గెలుపును అడ్డుకోలేదని బిజెపి అభ్యర్థి రఘునందనరావు స్పష్టం చేసారు.  దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలిచేందుకు ప్రభుత్వం అన్ని వ్యవస్థలను వాడుకుంటోందని, అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

బీజేపీ కార్యకర్తలను లక్ష్యంగా చేస్తూ పోలీసులు అడ్డుకుంటున్నారని, అధికారులు మంత్రి హరీశ్ రావుకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దుబ్బాకలో బీజేపీకి బలమే లేదన్న  హరీశ్ రావు మరి ఎందుకింత భయపడుతున్నారని ప్రశ్నించారు. అధికారుల తీరుపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యా దు చేస్తామని తెలిపారు.

తన వాహనాన్ని అక్రమంగా ఆపివేస్తున్నారని తెలుపుతూ సోమవారం రోజున తూప్రాన్‌ వద్ద మూడు గంటల వరకు వాహనం తనిఖీ చేయకుండా నిలిపేశారని, ఫోన్‌ లాక్కోని వాహనాన్ని తనిఖీ చేస్తున్న వీడియోలను తొలగించారని తెలిపారు.

బీజేపీ కార్యకర్త వంశీకృష్ణ కారును ఒకేరోజు పలుసార్లు తనిఖీ చేశారని, ఒక్క రూపాయి దొరకలేదని చెప్పారు. కారులో డబ్బులు తీసుకెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని చెబుతున్న పోలీసులు తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కేసు పెట్టాలని రఘునందనరావు  డిమాండ్ చేశారు. పోలీసుల తీరుపై సిద్దిపేట కమిషనర్ కు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పింఛన్లు, కేసీఆర్ కిట్లలో కేంద్ర నిధులు లేవన్న మంత్రి హరీశ్ రావు.. దానిపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని రఘునందన్ రావు సవాల్ విసిరారు. గత ఆరేండ్లలో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల నియోజకవర్గాలకు ఎన్ని నిధులు వచ్చాయో? దుబ్బాకకు ఎన్ని నిధులు వచ్చాయో?    శ్వేతపత్రం  విడుదల  చేయాలని డిమాండ్ చేశారు. 

సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని బీజేపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేసిన పోలీసులు హరీశ్ రావు బీజేపీ కార్యకర్తలను తిట్టినా ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ నాణేనికి బొమ్మబొరుసు లాంటివని ఎద్దేవా చేశారు.