మరో ఉద్దీపన ప్యాకేజీ ఉండొచ్చు

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మరో కొవిడ్-19 ఉద్దీపన ఉపశమన ప్యాకేజీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ సంకేతం ఇచ్చారు. 15 వ ఆర్థిక కమిషన్ చైర్‌పర్సన్ ఎన్‌కే సింగ్‌ రచించిన పుస్తకం ఆవిష్కరణ సభలోమాట్లాడుతూ ప్రభుత్వం ఇంకా అలాంటి దారులను మూసివేయలేదని చెప్పారు. 

“మేం ఇప్పుడు జీడీపీ సంకోచంపై అంచనా వేయడం ప్రారంభించాం. మాకు కొంత ఇన్పుట్ సమాచారం వచ్చింది. పార్లమెంటులో లేదా బహిరంగంగా అయినా మేం అంచనా వేయవలసి ఉంటుంది” అని ఆమె తెలిపారు. కరోనా వైరస్ ప్రేరేపిత లాక్‌డౌన్ నష్టం నుంచి కోలుకోవడానికి వ్యాపారాలు, కార్మికుల కోసం మే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించారు. 

ఈ ప్యాకేజీ భారతదేశ గ్రేడ్ దేశీయ ఉత్పత్తి (జీడీపీ) లో 10 శాతం కలిగి ఉన్నది. ఇది ప్రధానంగా భూమి, శ్రమ, ద్రవ్యత, చట్టాలపై దృష్టి పెట్టింది. ఇది భారతదేశ స్థూల పన్ను ఆదాయంలో దాదాపు పూర్తి సంవత్సరానికి ఉన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన ద్రవ్య సడలింపును కలిగి ఉన్నది. 

ఇలాఉండగా, నిర్మలా సీతారామన్ ఇవాళ పెట్రోలియం, సహజ వాయువు, బొగ్గు మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో పాటు ఈ మంత్రిత్వ శాఖలకు చెందిన 14 సీపీఎస్‌ఇల సీఎండీలతో కలిసి ఈ ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని సమీక్షించేందుకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్‌-19 మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ఆర్థిక మంత్రి వివిధ వాటాదారులతో నిర్వహిస్తున్న సమావేశాలలో ఇది నాలుగవది. 

2019-20 ఆర్థిక సంవత్సరంలో 14 సీపీఎస్‌ఇల కోసం క్యాపెక్స్ లక్ష్యం రూ.1,11,672 కోట్లు కాగా.. రూ.1,16,323 కోట్లు సాధించింది. అంటే 104 శాతం. 2019-20 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌1 సాధించినది రూ .43,097 కోట్లు (39 శాతం), 2020-21 ఆర్థిక సంవత్సరంలో సాధించిన విజయాలు హెచ్‌1 రూ .37,423 కోట్లు (32 శాతం). కాగా, 2020-21కి క్యాపెక్స్ లక్ష్యం రూ.1,15,934 కోట్లుగా ఉన్నది.