జమ్ముకశ్మీర్‌ చైనాలో భాగమని ట్విట్టర్‌ లొకేషన్‌ ట్యాగ్‌

జమ్ముకశ్మీర్‌ చైనాలో భాగమని ట్విట్టర్‌ లొకేషన్‌ ట్యాగ్‌ చూపుతూ ఉండడం పెద్ద దుమారం రేపింది. జర్నలిస్ట్‌, రచయిత, జాతీయ భద్రతా విశ్లేషకుడైన నితిన్ గోఖలే ఆదివారం లఢక్‌లోని లేహ్‌లో పర్యటించారు. దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల జ్ఞాపకార్థం నిర్మించిన హాల్ ఆఫ్ ఫేమ్‌ నుంచి ఆయన ట్విట్టర్‌లో ప్రత్యక్ష ప్రసారం నిర్వహించారు.

అయితే ఈ లైవ్‌ వీడియో లొకేషన్‌ ట్యాగ్‌ ‘జమ్ముకశ్మీర్‌, పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా’ అని చూపింది. దీనిని గుర్తించిన నితిన్‌ గోఖలే ట్విట్టర్‌తోపాటు ఆ సంస్థ భారత్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అయినా కూడా ట్విట్టర్‌ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

మరోవైపు కొంతమంది ట్విట్టర్‌ వినియోగదారులు కూడా లేహ్‌ జియో ట్యాగ్‌ పేరుతో ఫొటోలు, లైవ్‌ బ్రాండ్‌కాస్టింగ్‌ చేసేందుకు ప్రయత్నించారు. అయితే లఢక్‌ రాజధాని అయిన లేహ్‌ చైనాలో భాగంగా ట్విట్టర్‌ లొకేషన్‌ ట్యాగ్‌ చూపింది.

అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు చెందిన కాంచన్ గుప్తా కూడా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. దీంతో ‘భౌగోళిక పునర్నిర్మాణాన్ని ట్విట్టర్‌ నిర్ణయించింది. జమ్ముకశ్మీర్‌ను పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాలో భాగంగా ప్రకటించింది’ అని ఆరోపించారు. ఇది భారత చట్టాలను ఉల్లంఘించడం కాదా, అమెరికాకు చెందిన ట్విట్టర్‌ సంస్థ చట్టాలకు అతీతమా? ’ అని ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

కాగా జియోట్యాగ్‌ వివాదంపై ట్విట్టర్‌ అధికార ప్రతినిధి స్పందిస్తూ  భారతీయుల మనోభావాలను తాము అర్థం చేసుకున్నామని చెప్పారు. సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగిందని పేర్కొన్నారు. తమ బృందం దీనిపై దర్యాప్తు చేస్తున్నదని జియో ట్యాగ్‌కు సంబంధించిన ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నదని వెల్లడించారు.

మరోవైపు ఇటీవల షియోమి మొబైల్‌ ఫోన్లు అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రాంతంలో వాతావారణాన్ని సూచించడం లేదు. యూట్యూబ్‌ చానల్‌ ‘టెక్నికల్‌ గురూజీ’కి చెందిన గౌరవ్‌ చౌదరీ ఈ ఫోన్‌పై సమీక్షలో భాగంగా దీనిని గుర్తించారు.

పలువురు షియోమి మొబైల్‌ వినియోగదారులు కూడా దీనిపై ఫిర్యాదు చేశారు. తూర్పు లఢక్‌ సరిహద్దులో భారత్‌, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో ఈ రెండు ఘటనలు వెలుగుచూడటం ప్రాధాన్యత సంతరించుకున్నది.