జ్ఞాన‌పీఠ్ అవార్డు గ్ర‌హీత అక్కితం క‌న్నుమూత‌

 
మ‌ల‌యాళ మ‌హా క‌వి అక్కితం అచ్చుత‌మ్ నంబూద్రి ఇవాళ క‌న్నుమూశారు. త్రిసూరులోని ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 94 ఏళ్లు. గ‌త ఏడాది జ్ఞాన్‌పీఠ్ అవార్డును ఆయ‌న గెలుచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 24వ తేదీన కేర‌ళ‌లో జ‌రిగిన ఓ కార్య‌క్ర‌మంలో అక్కితంకు ఆ అవార్డును అంద‌జేశారు.  
 
కేర‌ళ సాహిత్యంలో త‌న ర‌చ‌న‌ల‌తో నూత‌న ఉత్సాహాన్ని తీసుకువ‌చ్చిన‌ట్లు అక్కితంను మ‌ల‌యాళీలు అభిమానిస్తారు.  
1926లో పాల్కాడ్ జిల్లాలోని కుమ‌ర‌న్న‌ల్లూరులో ఆయ‌న పుట్టారు.   క‌మ్యూనిస్టు అగ్రనేత ఈఎంఎస్ నంబూద్రిపాద్‌తో ఆయ‌న‌కు స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇద్ద‌రూ సామాజిక సంస్క‌ర‌ణ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. 
 
చిన్నతనంలోనే సంస్కృతం, సాహిత్యం, జ్యోతిష్యం అధ్యయనం ప్రారంభించారు.  ఆల‌యాల గోడ‌ల‌పై చిన్న‌త‌నం నుంచే ఆయ‌న త‌న క‌విత‌ల‌ను రాస్తూ ఉండేవారు. క‌విత‌లు, క‌థ‌లు, నాట‌కాలు, వ్యాసాల‌తో.. కేర‌ళ సాహిత్యంలో ఆధునిక మ‌హాక‌విగా అక్కితం పేరును సంపాదించారు. 
 
అత్యున్న‌త సాహితీ అవార్డు జ్ఞాన‌పీఠ్‌ను ఓ కేర‌ళ క‌వి గెలుచుకోవ‌డం ఆర‌వ‌సారి. కోవిడ్ వ‌ల్ల ఏర్పడిన లాక్‌డౌన్‌తో అవార్డు అంద‌జేత కార్య‌క్ర‌మాన్ని చాన్నాళ్లూ వాయిదా వేశారు. 2017లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 
 
బ్ర‌తికి ఉన్న  మ‌ల‌యాళీ క‌వుల్లో అక్కితం సాహిత్యం అద్భుత‌మైంద‌ని ముఖ్యమంత్రి  విజ‌య‌న్ పేర్కొన్నారు. మ‌ల‌యాళీ ప్ర‌జ‌లు అక్కితంను మ‌హాక‌విగా భావిస్తుంటారు.  ఆధునిక సాహిత్యానికి వ‌న్నె తెచ్చిన‌ట్లు చెబుతుంటారు.  ఆకాశ‌వాణిలో స్క్రిప్ట్ రైట‌ర్‌గా మూడు ద‌శాబ్ధాల పాటు ప‌నిచేశారాయ‌న‌.