మంత్రి వెలంపల్లికి తిరిగి కరోనా ?

ఏపీ దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో అత్యవసర చికిత్స కో సం బుధవారం మధ్యాహ్నం ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. అక్కడి అపోలో ఆస్పత్రిలో మంత్రి చికిత్స పొందుతున్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. 

మంత్రి వెలంపల్లికి కరోనా తిరగబెట్టిందని, ప్రస్తుతం ఆయన ఆరో గ్య పరిస్థితి చాలా సీరియ్‌సగా ఉందని తెలిసింది. గత నెలలో మంత్రి తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లిన సీఎం జగన్‌, సహచర మంత్రులు, వైసీపీ నేతలు, అధికారులతో కలివిడిగా మెలిగారు.

ఆ తర్వాత ఆయనకు కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో తిరుమల నుంచి తిరిగొచ్చి విజయవాడలోని ప్రైవేటు ఆస్పతిల్రో వారం రోజులకు పైగా చికి త్స తీసుకున్నారు. కరోనా నుంచి కోలుకున్నాక ఈనెల 8న విజయవాడలోని పాఠశాల విద్యార్థులకు ‘జగనన్న విద్యాకానుక’ పంపిణీ చేశారు.

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి దసరా ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 21న మూలానక్షత్రం రోజున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాలని కోరుతూ 2 రోజుల క్రితమే దుర్గగుడి అధికారులతో కలిసి మంత్రి కూడా సీఎం జగన్‌ను కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

కాగా, గతంలో మంత్రికి చికిత్స అందించిన సన్‌రైజ్‌ ఆస్పత్రి వైద్యుడు కూడా హైదరాబాద్‌ వెళ్లినట్లు తెలిసింది.