జగన్ `లేఖ’పై ఢిల్లీ బార్ ఆగ్రహం 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్  జగన్మోహన్‌రెడ్డిపై ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థపై జోక్యం చేసుకునే నికృష్టమైన ప్రయత్నాలను సీఎం జగన్‌ మానుకోవాలని బార్‌ అసోసియేషన్‌ హెచ్చరించింది. సుప్రీం కోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి  సీఎం జగన్‌ లేఖ రాయడాన్ని తప్పుబట్టింది.

న్యాయవ్యవస్థను కించపరిచేలా, బురదజల్లేలా జగన్‌ లేఖ ఉందని, జగన్‌ చర్యలను అత్యంత తీవ్రమైన పదజాలంతో ఖండిస్తున్నామని బార్ అసోసియేషన్ తెలిపింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ మచ్చలేని వ్యక్తి అని, అలాంటి వ్యక్తిపై ఆరోపణలు చేయడం తగదని హితవు పలికింది. 

జస్టిస్‌ ఎన్వీ రమణ ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కూడా పని చేశారని, అత్యుత్తమ నిబద్ధతగల న్యాయమూర్తుల్లో జస్టిస్‌ ఎన్వీ రమణ ఒకరని, ఆయనపై జగన్‌ ఆరోపణల్ని ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ఢిల్లీ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ పేర్కొంది. 

న్యాయవ్యవస్థపై పెత్తనం చెలాయించే ప్రయత్నంలో భాగంగానే కాబోయే సీజేఐ స్థానంలో ఉన్న జస్టిస్ రమణపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ దుయ్యబట్టింది.  ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్‌ లేఖ పూర్తిగా:  

‘‘సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టుకు చెందిన పలువురు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసినట్టు వార్తలు వచ్చాయి. 

ఈ వ్యవహారం న్యాయవ్యవస్థ, చట్ట సమితికి సంబంధించినది కాబట్టి.. ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ దీనిపై చర్చించి, సమాలోచనలు చేయడం జరిగింది. అనంతరం ఎగ్జిక్యూటివ్ కమిటి ఈ క్రింది విధంగా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తికి దురుద్ధేశ పూర్వకంగా లేఖ రాయడం, దాన్ని బహిరంగపర్చడం దారుణం. అకారణంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులపై తీవ్ర ఆరోపణలు చేయడం గర్హనీయం. 

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం తగదు. లేఖ రాయడం, దాన్ని బహిరంగంగా సర్కులేట్ చేయడం న్యాయ వ్యవస్థ స్వేచ్ఛకు భంగం కలిగించడమే. ఇది కచ్చితంగా గౌరవ కోర్టును ధిక్కరించడం కిందికే వస్తుంది. న్యాయ వ్యవస్థ పట్ల ప్రజల్లో ఉన్న అపార నమ్మకాన్ని దెబ్బతీసే ఈ దుష్ట ప్రయత్నాన్ని ఢిల్లీ కోర్టు బార్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తోంది. 

భారత రాజ్యాంగం అప్పగించిన బాధ్యతను న్యాయ వ్యవస్థ అత్యంత అంకిత భావంతో నిర్వహిస్తోంది. సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందనున్న జస్టిస్ ఎన్వీ రమణ అత్యంత సమర్థమైన, నిజాయితీ గల న్యాయమూర్తుల్లో ఒకరు. ఆయనపై చేసిన ఆరోపణలను ఢిల్లీ హైకోర్టు బార్ అసోసియేషన్ నిర్ద్వంద్వంగా ఖండిస్తోంది…’ అంటూ ఢిల్లీ బార్ అసోసియేషన్ తన లేఖలో పేర్కొంది.