బంగారం స్ముగ్లింగ్ కేసులో సీఎం విజయన్ 

కేరళ బంగారు స్మగ్లింగ్ కేసు ప్రధాన నిందితుడు స్వప్నా సురేష్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ముందు తాజాగా చెప్పిన అంశాలతో ఈ కుంభకోణంలో సిపిఎం అధినేత, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు గల అసంబంధంపై పలు అనుమానాలు చెలరేగుతున్నాయి.

పినరయిని తాను చాలాసార్లు కలుసుకున్నానని, ఆ సమావేశాలన్నీ సిఎం అధికారిక నివాసంలోనే జరిగాయని ఆమె తెలిపింది. ఆమె కధనం ప్రకారం 2017లో జరిగిన అటువంటి ఒక సమావేశంలో యుఎఇ కాన్సుల్ జనరల్, అతని అప్పటి కార్యదర్శి స్వప్న సురేష్ హాజరయ్యారు.

ఇక నుండి తన ప్రిన్సిపల్ కార్యదర్శి ఎం. శివశంకర్, యుఎఇ కాన్సులేట్, కేరళ ప్రభుత్వానికి మధ్యవర్తిగా వ్యవహరిస్తారని ఆ సమావేశంలో విజయన్ చెప్పిన్నట్లు ఆమె పేర్కొన్నారు. అప్పటి నుండి యుఎఇ కాన్సులేట్ సంబంధిత వ్యవహారాలకు సంబంధించి శివశంకర్ ఆమెను క్రమం తప్పకుండా పిలవడం ప్రారంభించాడు.

ఈ విషయాలపై స్వప్న కూడా శివశంకర్ ను పిలవడం ప్రారంభించింది. సహజంగానే, వారి పరస్పర సంబంధాలు కొత్త ఎత్తులకు చేరుకొంటూ వచ్చాయి. ముఖ్యమంత్రి నివాసంలోనే ఇటువంటి అనేక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలలో ముఖ్యమంత్రితో పాటు కాన్సుల్ జనరల్, శివశంకర్, స్వప్న సురేష్ పాల్గొన్నారు. అవన్నీ ‘ప్రైవేట్ సమావేశాలు’ అని స్వప్న చెప్పడం గమనార్హం.

స్వప్నా సురేష్ యొక్క ఈ తాజా ప్రకటనను చూస్తే శివశంకర్ ను కేరళ ప్రభుత్వం, కాన్సులేట్ ల మధ్య ‘అనుసంధాన వ్యక్తి’గా మార్చిన్నట్లు భావించవలసి వస్తుంది. దానితో ఈ విషయమై మరింత లోతుగా దర్యాప్తు జరపాలనే డిమాండ్ కు దారితీస్తున్నది.

ఇడి విచారణలో శివశంకర్ కూడా ఈ సమావేశాలు జరిగిన్నట్లు అంగీకరించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, పినరయి తనకు స్వప్న తెలియదని పేర్కొంటూనే ఉన్నారు. చాలా తరచుగా ఆయన ఆమెను కేవలం “వివాదాస్పద మహిళ” గా వర్ణించే ప్రయత్నం చేస్తున్నారు.

మరోవైపు, స్పేస్ పార్క్ ప్రాజెక్టులో లాభదాయకమైన తన నియామకం గురించి ముఖ్యమంత్రికి బాగా తెలుసని స్వప్నా ఇడీ ముందు పేర్కొనడం గమనార్హం. కాన్సులేట్‌కు సిఎం చేసిన అభ్యర్థన ఆధారంగా యుఎఇకి అధికారిక ప్రతినిధి బృందంలో ఆమెను చేర్చుకున్నట్లు ఆమె కొద్ది రోజుల ముందు ఎన్‌ఐఏ ముందు తెలిపింది. పినారాయ్ సూచనల మేరకు స్వప్నను జట్టులో చేర్చుకున్నట్లు శివశంకర్ చెప్పినట్లు తెలుస్తున్నది.

ఇప్పుడు, చిత్రం స్పష్టంగా వ్యక్తం అవుతున్నది. ఈ కేసుల్లో ముఖ్యమంత్రి ప్రమేయం ఉందని బిజెపి చేసిన ఆరోపణకు మరింత బలం చేకూరుతున్నది. ఇంతలో కస్టమ్స్ విభాగం స్వప్న సురేష్, సందీప్ నాయర్ లను కోఫెపోసా కింద అదుపులోకి తీసుకుంది. ఆర్థిక నేరాలు, అక్రమ రవాణాపై వారిపై అభియోగాలు మోపారు. దీని ప్రకారం కస్టమ్స్ ఇద్దరినీ విచారణ లేకుండా ఒక సంవత్సరం జైలులో ఉంచే అవకాశం ఉంది.

 శివశంకర్ ను  ఎన్‌ఐఏ తో సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అక్టోబర్ 10 న 11 గంటలు అతన్ని విచారించగా, ఆ మరుసటి రోజు కూడా విచారించారు. మళ్లీ విచారించారు.

ఇప్పుడు, పినారాయ్ ఒక నిరంకుశ నేతగా మారేందుకు సిద్దపడుతున్నారు. అన్ని అధికారాలను తన చేతుల్లో కేంద్రీకరించుకొనే విధంగా వ్యాపార నియమాలను సవరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తున్నది. 

అది కార్యరూపం దాల్చితే మంత్రులు కార్యనిర్వాహక అధికారాలను కోల్పోతారు. సీఎం, వివిధ శాఖల కార్యదర్శులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు.  మంత్రులతో సమానంగా కార్యదర్శులకు అధికారం సమకూరుతుంది. ఈ ప్రయత్నాలను ఇప్పటికే సిపిఐ మంత్రులు వ్యతిరేకించారు.