రైతులే  ఔత్సాహిక వ్యాపార‌వేత్త‌లు  

త‌మ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన చ‌రిత్రాత్మ‌క వ్య‌వ‌సాయ సంస్క‌ర‌ణ‌ల‌తో రైతులు ఔత్సాహిక వ్యాపార‌వేత్త‌లుగా మారుతార‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలిపారు.  రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కూడా త‌మ ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని స్పష్టం చేశారు. 

 మాజీ కేంద్ర మంత్రి బాలాసాహెబ్ విఖే పాటిల్ ఆటోబ‌యోగ్ర‌ఫీ విడుదల సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో మాట్లాడారు.  ఇటీవ‌ల పార్ల‌మెంట్‌లో ఆమోదం పొందిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను చ‌రిత్రాత్మ‌కంగా కీర్తించిన మోదీ అన్న‌దాత‌ల‌ను ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌లుగా మారుస్తున్న‌ట్లు తెలిపారు. 

గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర‌, హ‌ర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో అత్య‌ధిక స్థాయిలో పాలు, చెరుకు, గోధుమ ఉత్ప‌త్తి జ‌రుగుతున్న‌ద‌ని, అలాంటి స్థానిక వ్యాపారం దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంద‌ని భరోసా వ్యక్తం చేశారు. స్వాత్రంత్య్రం వ‌చ్చిన తొలి రోజుల్లో దేశంలో స‌రిప‌డా ఆహార నిల్వ‌లు లేవ‌ని గుర్తు చేశారు. 

ఆ రోజుల్లో కేవ‌లం ఆహార ఉత్ప‌త్తిపై దృష్టి పెట్టార‌ని, ఆ ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు రైతులు చాలా క‌ష్ట‌ప‌డేవారని పేర్కొ‌న్నారు. కానీ ప్ర‌భుత్వాలు విధాన‌క‌ర్త‌లు రైతుల లాభంపై దృష్టి పెట్ట‌లేద‌ని ప్రధాని విమర్శించారు.  ఉత్ప‌త్తిపై దృష్టిన వారంతా రైతు ఆదాయాన్ని విస్మ‌రించిన‌ట్లు తెలిపారు. అయితే ఇప్పుడు ఆ ఆలోచ‌న మారింద‌ని చెప్పారు. 

కాగా, భారత్‌లో కరోనా వైరస్‌ కేసులు మంగళవారం రెండు నెలల కనిష్టస్దాయిలో నమోదైన నేపథ్యంలో హమ్మారిపై మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రధాని సూచించారు. వ్యాక్సిన్‌ బయటకు వచ్చే వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. 

భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్‌-19 నిబంధనలను విధిగా పాటించాలని అంటూ  వైరస్‌ ముప్పు మనల్ని ఇంకా వెంటాడుతూనే ఉందని స్పష్టం చేశారు. 

కరోనా వైరస్‌ ప్రమాదం ఇంకా కొనసాగుతోందని, మహారాష్ట్రలో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని వ్యాక్సిన్‌ వచ్చేవరకూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.