విజ‌య‌రాజే స్మార‌కార్థం రూ.100 నాణెం విడుద‌ల  

భారతీయ జ‌న‌తాపార్టీ స‌హ వ్య‌వ‌స్థాప‌కురాలు, రాజ‌మాత విజ‌య‌రాజే సింధియా జ్ఞాప‌కార్థం కేంద్ర ప్ర‌భుత్వం రూ.100 కాయిన్‌ను విడుదల చేసింది. విజ‌య‌రాజే సింధియా 100వ‌ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని కేంద్ర ఆర్థిక‌శాఖ ముద్రించిన ఈ ప్ర‌త్యేక కాయిన్‌ను ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ చేతుల మీదుగా వ‌ర్చువ‌ల్ విధానంలో లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ రాజ‌మాత విజ‌య‌రాజే సింధియా పేద ప్ర‌జ‌ల కోసం త‌న జీవితాన్ని అంకితం చేశార‌ని చెప్పారు. ప్ర‌జాప్ర‌తినిధులకు రాజ‌భోగాల కంటే ప్ర‌జాసేవే ముఖ్యం అనే విష‌యాన్ని విజ‌య‌రాజే సింధియా నిరూపించార‌ని ప్ర‌ధాని మోదీ కొనియాడారు. 

త్రిపుల్ తలాక్‌కు వ్య‌తిరేకంగా చ‌ట్టం చేయ‌డం ద్వారా.. దేశంలో స్త్రీ సాధికార‌త కోసం రాజ‌మాత సింధియా క‌న్న క‌లల‌‌ను కొంతమేర‌కు నెర‌వేర్చ‌గ‌లిగామ‌ని ఆయ‌న చెప్పారు.  స్వాతంత్య్ర  ఉద్యమం నుంచి రాజకీయాలదాకా రాజమాత ముఖ్యపాత్ర వహించారని మోదీ చెప్పారు. నాడు స్వతంత్ర ఉద్యమంలో విదేశీ దుస్తులను దహనం  చేశారని గుర్తు చేశారు. 

నాడు ఏక్తా యాత్ర సమయంలో విజయరాజే తనను గుజరాత్ యువ నాయకుడిగా పరిచయం చేశారని నాటి రోజులను మోదీ గుర్తు చేసుకున్నారు. రాజమాతకు జనసంఘం అధ్యక్షురాలిగా ఉండమని నాడు అటల్ జీ, అద్వానీలు కోరగా, ఆమె దాన్ని సున్నితంగా తిరస్కరించి సాధారణ జనసంఘ్ కార్యకర్తగా సేవలు చేశారని ప్రధాని తెలిపారు.