బిహార్‌లో బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లు మోదీ, యోగి

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన స్టార్‌ క్యాంపెయినర్ల జాబితాను ఆదివారం సాయంత్రం విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఉన్నారు.
 
వీరితోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజనాథ్ సింగ్, సంజయ్ జైస్వాల్, సుశీల్ మోదీ, భూపేంద్ర యాదవ్, దేవేంద్ర ఫడ్నవీస్, రాధామోహన్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, గిరిరాజ్ సింగ్ తదితరులు కూడా ఉన్నారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో 30 మంది నాయకులు ఉన్నారు. వీరే కాకుండా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా పార్టీ తరపున ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.
 
అదేవిధంగా, అభ్యర్థుల రెండో జాబితాను కూడా బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 46 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. నౌతాన్ నుంచి నారాయణ ప్రసాద్, చన్పాటియా నుంచి ఉమాకాంత్ సింగ్, బెట్టియా నుంచి రేణు దేవి, హర్సిద్ధి నుంచి కృష్ణానంద్ పాస్వాన్, గోవింద్‌గంజ్ నుంచి సునీల్ మణి త్రిపాఠి, కల్యాణపూర్ నుంచి సచినేంద్ర ప్రసాద్ సింగ్, పిప్రా నుంచి శ్యాంబాబు ప్రసాద్‌ యాదవ్‌కు టిక్కెట్లు లభించాయి.
 
కాగా, బిహార్ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమికి మద్దతివ్వాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా  బిహార్‌ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు, ఎన్నికలు స్నేహం, కులం, సోదరభావం లేదా స్వీయ ఓటమి గురించి కాదు, ఎన్నికలు అభివృద్ధితో ముడిపడి ఉన్నాయని తెలిపారు. 
 
ప్రజలు అభివృద్ధికి ఓటు వేయాలని గయాలోని గాంధీ మైదానంలో నిర్వహించిన ర్యాలీ బహిరంగసభలో నడ్డా పిలుపునిచ్చారు. కులం, మతం ప్రాతిపదికన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటని మండిపడ్డాయిరు. 
 
మోదీ, నితీష్ కుమార్ బిహార్‌లో రాజకీయ సంస్కృతిని మార్చారని, నరేంద్ర మోదీ ప్రభుత్వ పనుల రిపోర్ట్ కార్డు ఆధారంగా ప్రజల్లోకి వెళ్ళే సంస్కృతిని ప్రారంభించారని చెప్పారు.