బీజేపీకి వెన్నుదన్నుగా  బిసిలు 

బీజేపీకి బీసీలు వెన్నుదన్నుగా ఉండబట్టే అన్ని రాష్ట్రాల్లో అధికారం సాధ్యపడిందని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా. లక్ష్మణ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా బీసీలను బీజేపీకి చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని ఆయన చెప్పారు. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉద్యోగాల్లో వెనుకబడిన వర్గాల కోసం ప్రధాని మోడీ ఎన్నో పథకాలు అమలులోకి తెచ్చారని ఆయన గుర్తు చేశారు.

‘స్వయంగా ప్రధాన మంత్రే బీసీ వర్గాల నుంచి వచ్చారు. అన్ని రాష్ట్రాల్లో పర్యటించి బీసీలను చైతన్యపరిచి బీజేపీ వైపు తీసుకురావాలి. బీసీ కమిషన్‌కి చట్టబద్ధత కల్పించి, ఆ వర్గాల అభ్యున్నతికి పాల్పడింది మోడీ సర్కారే. బీసీల్లో కూడా ప్రభుత్వ ఫలాలు కొందరికే అందుతున్నాయి. మిగతా బీసీ వర్గాలకు కూడా ఫలాలు అందేలా జస్టిస్ రోహిణి కమిషన్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు. 

రోస్టర్ సిస్టమ్‌లో మార్పులు తీసుకొచ్చి, అనేక సంక్షేమ పథకాలు బీసీల కోసం అమలు చేస్తున్నామని చెబుతూ కరోనా సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలను బుక్ రూపంలో తీసుకొచ్చామని లక్ష్మణ్ తెలిపారు.  బీజేపీ జాతీయ కార్యవర్గం భేటీలో బీహార్ ఎన్నికలు, తెలంగాణలోని దుబ్బాక ఉపఎన్నికల గురించి కూడా చర్చించామని చెప్పారు. 

రైతు చట్టాల విషయంలో వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్ఎస్ కూడా అలాగే చేస్తోందని మండిపడ్డారు. కిసాన్ అభియాన్‌తో వ్యవసాయ చట్టాల గురించి రైతులకు వివరిస్తామని తెలిపారు. 

కేసీఆర్ దోపిడీ ఎక్కడ ఆగిపోతుందనే ఉద్దేశ్యంతోనే రైతు బిల్లులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని లక్ష్మణ్ ఆరోపించారు. తెలంగాణలో కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు.