త్వరలో తెరపైకి సత్యం రామలింగరాజు కధనం!

* సప్తగిరి గోపగాని 

భారత దేశ కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్ద ఆర్ధిక కుంభకోణంగా చరిత్ర సృష్టించిన సత్యం రామలింగరాజు చరిత్ర త్వరలో తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌, ఇండియా… వెబ్‌ సిరీస్‌లలో ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా, వివాదాస్పదంగా మారిన బుల్లి సినిమా. ఓటీటీ వేదికపై ప్రకంపనలు సృష్టిస్తున్న సిరీస్‌. దేశంలో అతి పెద్ద ఆర్థిక నేరాలకు పాల్పడ్డ ప్రముఖ వ్యాపారవేత్తలకు సంబంధించిన జీవిత చరిత్ర ఆధారంగా ఈ వెబ్‌ సిరీస్‌ రూపొందించినట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. 

ప్రధానంగా ఐదుగురి కథలను ఇందులో చేర్చారు. ఓటీటీ కింగ్‌.. నెట్‌ఫ్లిక్స్‌ ఈ వెబ్‌ సిరీస్‌ను రూపొందించింది. దేశంలో అతిపెద్ద ఆర్థిక నేరస్తులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, రామలింగ రాజు, సుబ్రతా రాయ్, మెహల్ చోక్సిల ఆర్థిక నేరాలు, వాళ్లు ప్రభుత్వాన్ని మోసం చేసిన విధానాన్ని వెబ్‌సిరీస్‌గా షూట్‌ చేశారు.  

సెప్టెంబర్‌ 2వ తేదీన విడుదల కావాల్సిన ఈ వెబ్‌సిరీస్‌ స్ట్రీమింగ్‌.. ఒక నెల ఆలస్యంగా అక్టోబర్‌ 2వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే సత్యం రామలింగరాజు ఎపిసోడ్‌ మాత్రం రిలీజ్ కాలేదు. నిజానికి అందరి చరిత్రలూ ఒకేసారి విడుదల చేసేందుకు నెట్‌ఫ్లిక్స్‌ ఏర్పాట్లు చేసింది. కానీ, రామలింగరాజు అంశం కోర్టులో ఉండటంతో ఆ ఒక్క ఎపిసోడ్‌ను ఆపేసింది.  మిగిలిన సిరీస్‌లను విడుదల చేసింది. 

నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌లో నిలిచిపోయిన సత్యం రామలింగరాజు ఎపిసోడ్‌‌ ఎప్పుడు స్ట్రీమింగ్‌లోకి వస్తుందో ఈనెల 9వ తేదీన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఈ సిరీస్‌ రూపొందించిందని తెలిసి.. విడుదల కాకుండా చూడాలని సత్యం రామలింగరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఈ సిరీస్‌ను రూపొందించినట్లు అనుమానాలున్నాయని ఆరోపించారు. 

దీంతో కోర్టు స్టే విధించింది. ఈ కారణంగానే సెప్టెంబర్‌ 2వ తేదీన విడుదల కావాల్సిన సిరీస్‌ వాయిదా పడింది. ఇప్పుడు మిగతావాళ్ల ఎపిసోడ్‌లు ఆగమేఘాలమీద విడుదల చేసిన నెట్‌ఫ్లిక్స్‌.. రామలింగరాజు అంశంలో ఏం తేలుతుందో అని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలోనే స్టే ఉత్తర్వులను తొలగించి రామలింగరాజు ఎపిసోడ్‌ను కూడా విడుదల చేసేందుకు అనుమతించాలని నెట్‌ఫ్లిక్స్‌ హైకోర్టుకు వెళ్లింది. 

అయితే, తమ పూర్వీకులకు సంబంధించి కొంత తప్పుడు సమాచారాన్ని నెట్‌ఫ్లిక్స్‌ సేకరించిందని, అది బయటకు వస్తే తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుందని రామలింగరాజు తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో, ఈనెల 9వ తేదీలోగా ప్రతిస్పందించాలని న్యాయస్థానం నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది.  

అయితే, కోర్టులో విచారణ సందర్భంగా న్యాయమూర్తులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎపిసోడ్‌ ఆపాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఈ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ వాదిస్తున్న అంశాలను లేవనెత్తారు. ‘అందుబాటులో ఉన్న సమాచారంతో స్క్రిపట్‌్ రాసిన వాళ్లందరిపైనా పరువునష్టం దావాలు వేస్తామంటే.. రచయితలు ఎలా రాయగలుగుతారు. బ్యాడ్‌ బాయ్‌ బిలియనీర్స్‌ డాక్యుమెంటరీని చూడకుండానే చెడుగా చూపారనే నిర్ణయానికి రావడం సరికాదు’ అని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. 

అసలు, సత్యం కంప్యూటర్స్‌ వ్యవహారం.. కార్పొరేట్‌ ప్రపంచాన్నే ఓ కుదుపు కుదిపేసింది. 2009లో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. 2015 ఏప్రిల్ లో రామలింగరాజు సహా.. మరో 9 మందికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది న్యాయస్థానం. రూ 7,000 కోట్ల అకౌంటింగ్‌ మోసం జరిగినట్లు నిర్ధారించింది. 

2015 మేలో రామలింగరాజు సహా మిగతా నిందితులకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరుచేసింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సిరీస్‌తో రామలింగరాజు పేరు మరోసారి ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. కొన్నేళ్లుగా అప్రతిష్టపాలైన కొందరు పారిశ్రామిక వేత్తల జీవితాల ఆధారంగా బ్యాడ్‌బాయ్‌ బిలియనీర్స్‌ నిర్మాంచామని, వాళ్ల జీవితాల్లోని అన్నికోణాలను స్పృశించామని నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. 

(ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి నుండి)