జపాన్‌తో 5జి, కృత్రిమ మేధ ఒప్పందం

5 జి టెక్నాలజీ, కృత్రిమ మేధ, పలు ఇతర ప్రాధాన్యత సంక్లిష్ట రంగాలకు సంబంధించి భారత్ – జపాన్ ల మధ్య అత్యంత కీలకమైన, ప్రతిష్టాత్మక ఒప్పందం కుదిరింది.  పలు అభివృద్ధి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టితో తృతీయ దేశాలతో భారత్ – జపాన్ సహకారం మరింత విస్తృతికి కూడా మార్గం ఏర్పడింది. 

చైనా నుంచి సవాళ్ల నేపథ్యంలో భారత్ జపాన్ బంధం పరస్పర వ్యూహాత్మక బంధంగా మారింది. బుధవారం భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిత్సూ మోటెగితో టోక్యోలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై అంగీకారం కుదరిందని విదేశాంగ మంత్రి తెలియచేశారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో పరస్పర సంబంధాలు మరింత విస్తృతపర్చుకునేలా చర్చలుజరిగాయి. ప్రస్తుత ఐటి అవసరాల నేపథ్యంలో 5 జి టెక్నాలజీ దిశలో కుదిరిన ఒప్పందం అత్యంత కీలకంగా నిలుస్తుంది.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముచిత వాతావరణం నెలకొనేలా చేసే దిశలో చర్యల గురించి జపాన్ సారథ్య బాధ్యతలను తీసుకోవాలని భారత్  భావిస్తూ వస్తోంది. ఇందుకు అనుగుణంగానే ఇండో పసిఫిక్ ఒషియన్స్ ఇన్షియేటివ్ (ఐపిఒఐ)కు భారత్ మద్దతు వ్యక్తం చేసింది. 

చైనా తన సైనిక ఉనికిని బలోపేతం చేసుకుంటూ పోతున్న ఇండో పసిఫిక్ సముద్ర ప్రాంతంలో జపాన్ తగు విధంగా చెక్‌ పెట్టనుంది. ఈ క్రమంలో జపాన్‌కు భారత్ నుంచి పూర్తి సహకారం అందనుంది. 

ఇండొ పసిఫిక్ ప్రాంతాన్ని భద్రతాయుతంగా తీర్చిదిద్దేందుకు ఐపిఒఐని ఓ రోడ్ మ్యాప్‌గా ఎంచుకున్నారు. ఇప్పుడు జరిగిన 13వ భారత్ – జపాన్ విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం ఇప్పుడు జరిగిందని జైశంకర్ తెలిపారు.