బహిరంగ ప్రదేశాల్లో నిరసనలపై సుప్రీం ఆక్షేపణ 

నిరసనల పేరిట బహిరంగ ప్రదేశాలను, రహదారులను నిరవధికంగా ఆక్రమించడం ఎంతమాత్రం ఆమోదనీయంకాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) నిరసిస్తూ ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లో గత డిసెంబర్‌లో చేపట్టిన నిరసనలను ఉద్దేశిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

నిర్దేశిత ప్రదేశాల్లోనే నిరసనలను చేపట్టాలని, బహిరంగ ప్రదేశాలు, రోడ్లను దిగ్బంధిస్తూ సాధారణ ప్రజల హక్కులకు భంగం కలిగిస్తూ వారిని అసౌకర్యానికి గురిచేయడం తగదని పేర్కొంది. చట్టం ప్రకారం ఇది ఏ మాత్రం ఆమోదయోగ్యంకాదని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో నిరసనల విషయంలో సంబంధిత అధికారులు కోర్టు ఆదేశాల కోసం ఎదురుచూడకుండా తగిన నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించింది.

సీఏఏకు వ్యతిరేకంగా షాహీన్‌బాగ్‌ ప్రాంతంలో చేపట్టిన నిరసనల వల్ల కాలిందీ కుంజ్‌-షాహీన్‌ బాగ్‌ రహదారి మధ్య ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తాయని ఆరోపిస్తూ న్యాయవాది అమిత్‌ సాహ్ని సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ ఎస్కే కౌల్‌ నేతృత్వంలో జస్టిస్‌లు అనిరుద్ధ బోస్‌, కృష్ణ మురారితో కూడిన త్రిసభ్య ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ చేపట్టింది.

నిరసనల పేరుతో ప్రజల హక్కులను కాలరాయొద్దని, ప్రజాస్వామ్యం, నిరసన రెండూ సమాంతరంగా ముందుకు సాగాలని స్పష్టం చేసింది. గత డిసెంబర్‌లో షాహీన్‌బాగ్‌లో మొదలైన ఆందోళనలు మూడు నెలలపాటు కొనసాగాయి. అయితే, దేశంలో కేంద్రం లాక్‌డౌన్‌ విధించటంతో నిరసనకారులు అక్కడి నుంచి క్రమంగా నిష్క్రమించారు.