మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థను తెస్తున్నాం  

కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని, మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థను తీసుకువస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఆంధ్రప్రదేశ్  పర్యటనలో భాగంగా మంత్రి విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ సంస్కరణలు అనేవి కొత్తగా వచ్చినవి కాదని స్పష్టం చేశారు.

కార్మిక చట్టంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు. కరోనాపై పోరాటం చేస్తూనే సంస్కరణలు చేపడుతున్నట్లు చెప్పారు. రైతులు ఇకపై తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని వెల్లడించారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులు సంతోషంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

వివిధ చోట్ల పన్నులు కట్టే బాధ రైతులకు తప్పుతుందని ఆర్ధిక మంత్రి భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మార్కెట్‌యార్డులు, మధ్యవర్తులకు పన్నులు కట్టాల్సి వస్తుందని చెబుతూ కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా ఎవరికీ పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతుకు వస్తున్న ఆదాయంలో 8 శాతం వరకు పన్నులే కట్టాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు.

గతంలో వరి, గోదుమలకే కనీస మద్దతు ధరలు ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధరలు ఇస్తున్నట్లు ఆమె చెప్పారు. గతంలో కూరగాయలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు దక్కక రహదారిపైనే వదిలివెళ్లే పరిస్థితి ఉండేదని ఆమె గుర్తు చేశారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఆహార ఉత్పత్తుల రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు

తొలుత గన్నవరం మండలం జక్కలనెక్కలంలో పర్యటించి గ్రామంలోని రైతులతో సీతారామన్ సమావేశమయ్యారు. పంటలు, గిట్టుబాటు ధరలపై వారితో చర్చించారు. ఈ క్రమంలో చెరకు పంటకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని రైతులు వాపోయారు.

 క్వింటాల్ వరికి రూ.2 వేలు ఇవ్వాలని రైతులు తెలిపారు. కల్లాల్లో ధాన్యం ఉండకుండా ఎప్పటికప్పుడు కోనుగోలు చేసేలా చూడాలని రైతులు కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర ప్రభుత్వం  తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు జరుగుతుందని సీతారామన్ తెలిపారు.