వ్యవసాయం ధనార్జనకే కాదు.. అది మన ధర్మం 

భారత దేశంలో వ్యవసాయం కేవలం ధనార్జనకు మాత్రమే కాదని, విలువలు, సంప్రదాయం ఆధారితం కూడా అని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక డా. మోహన్ భగవత్ స్పష్టం చేశారు. 

రాజస్థాన్ లోని కోట వద్ద భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో  జరిగిన భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు దత్తోపంత్ థెంగడి శతజయంతి ఉత్సవాల ముగిపు సభలో ప్రసంగీస్తూ వ్యవసాయం కేవలం ప్రజలకు ఆహారం సమకూర్చడం కోసం మాత్రమే కాదని, అది మన ధర్మం అని తెలిపారు.

“మన ప్రాచీన గ్రంధాలలో లక్ష్మి దేవితో సంబంధం ఏర్పాటు చేస్తూ వ్యవసాయంను సౌభాగ్యానికి గుర్తుగా పేర్కొనేవారు. వ్యవసాయాన్ని సౌభాగ్యంతో పోల్చుతూ అనేక వివరణలు ఉన్నాయి. అది కేవలం ఉపాధికి మార్గం కాదు. మన సంస్కృతి, సంస్కార్ లతో సంబంధం కలది” అని తెలిపారు.

పాశ్చాత్య దేశాలలో వ్యవసాయాన్ని ఆర్ధిక వ్యవస్థలో భాగంగా చూస్తారని గుర్తు చేస్తూ “నేను దీనిని తప్పు బట్టడం లేదు. కానీ వారు వనరులను, పర్యావరణాన్ని దోపిడీ చేస్తున్నారు.  మనం వ్యవసాయాన్ని ఒక జీవన విధానంగా కొనసాగించాలి.  అప్పుడే వ్యవసాయం సమృద్ధి అవుతుంది” అని డా. భాగవత్ పేర్కొన్నారు.

ప్రపంచానికి దర్శన్ (దూరదృష్టి – విజన్) అంటూ లేదని కోవిద్ నిరూపించిందని, నేడు దూరదృష్టి కోసం అన్ని దేశాలు భారత్ వైపు చూస్తున్నాయని ఆయన చెప్పారు.

“ఇంతకు ముందు మొత్తం మంచి అనేడిది పశ్చిమంలో ఉన్నదనే అభిప్రాయం ఉండెడిది. మన  దర్శన్ మొత్తం పనికిరానిదనుకొనేవాళ్ళం. కానీ ప్రపంచానికి ప్రత్యామ్న్యాయ దృష్టి లేదని నేడు స్పష్టమైనది. భారత్ కు గల విశిష్టమైన ద్రుక్పద్దాన్ని  చెప్పవలసి ఉంది. ప్రపంచానికి మార్గదర్శనం చేయగల దర్శన్ మనవద్ద ఉంది” అని వివరించారు.

మనదేశంలో 10 వేల సంవత్సరాలకు పైగా వ్యవసాయం ఉంటూ వస్తున్నదని, నేడు ప్రపంచం అనుసరిస్తున్న సేంద్రియ వ్యవసాయం సహితం మన దేశంలో వేల సంవత్సరాలుగా కొనసాగుతున్నదని ఆయన తెలిపారు. ఆర్ ఎస్ ఎస్ ప్రముఖంగా ప్రోత్సహిస్తున్న గో-ఆధారిత వ్యవసాయాన్ని నేడు అనేక గ్రామాలలో అమలు పరుస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

నేడు ప్రభుత్వం సహితం మన సాంప్రదాయ వ్యవసాయాన్ని గుర్తిస్తున్నదని చెబుతూ అది మన పర్యావరణాన్ని, భూమిని కూడా కాపాడుతుందని డా. భాగవత్ తెలిపారు.

ఒక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్త ప్రతిపాదించినపుడు 50 ఏళ్ళ క్రితం భారత ప్రభుత్వం తిరస్కరించిన గో-ఆధారిత వ్యవసాయాన్ని నేడు భారత వ్యవసాయ పరిశోధన మండలి సహితం దీనిని ప్రోత్సహిస్తున్న మనలను అభినందిస్తున్నదని చెప్పారు.

జన్యుపరంగా మార్పుచెందిన (జీఎం) పంటల పేరును ప్రస్తావించకుండా రైతుల ఆదాయాలు పెంపొందించడానికి అనేక మార్గాలు ఉన్నాయని, వాటిని అనుసరించాలని సూచించారు.

“వ్యవసాయ పంటల జన్యువులలో మార్పు ఫలితం  ఏమిటో తెలియదు. చాలా మంది శాస్త్రవేత్తలు  వీటికోసం వత్తిడి చేస్తున్నారు. అయితే జన్యువులలో ఇటువంటి మార్పును మేము అంగీకరించము” అని స్పష్టం చేశారు.

” జన్యువులలో మార్పుకు సంబంధించి సైన్స్ వద్ద అన్ని సమాధానాలు లేవు.  అప్పుడు వాటిని ఎలా స్వీకరించగలం? రాజకీయ నాయకులు ప్రజాదరణ పొందిన నిర్ణయాలు తీసుకుంటారు, సైన్స్ వర్తమానాన్ని చూస్తుంది, కాని ఇక్కడ రైతులు తమకు ఏది మంచిదో నిర్ణయించుకోవాలి ” అంటూ డా. భాగవత్ రైతులకు మార్గదర్శనం చేశారు.

ఇప్పుడు కాలం మనకు అనుకూలంగా ఉన్నదని చెబుతూ అయితే ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు తమ ప్రయత్నాలను కేవలం సంస్థలను విస్తరించడంకు పరిమితం చేయరాదని వారించారు. మన ముందున్న మహోన్నత లక్ష్యాలను చేరుకొనే కృషి సాగించాలని హితవు చెప్పారు.

“మనం మహోన్నత కార్యాలు చేయవలసి ఉంది. దత్తోపంత్ జి వలే మన దృష్టి ఎప్పుడు క్షేత్రస్థాయిలో ఉండాలి. వేలకొలది కార్యకర్తల అవిశ్రాంత కృషి కారణంగా మనం నేటి స్థాయికి వచ్చామని గుర్తుంచుకోవాలి” అని మార్గదర్శనం చేశారు.