అమ‌రావ‌తిలో బ్రదర్ అనిల్ సంస్థకు టిటిడి ఆల‌య స్థ‌లం? 

టిడిపి హ‌యాంలో రూ 130 కోట్లతో తిరుమల తరహాలో రాజధాని ప్రాంతం అమరావతిలోని వెంకటాయపాలెంలో 25 ఎకరాల్లో ఆలయం నిర్మించాలని టిటిడి తలపెట్టిన స్థ‌లాన్ని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బావ బ్ర‌ద‌ర్ అనిల్ కు చెందిన క్రైస్త‌వ మిష‌న‌రీ సంస్థ‌కు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తున్నది. 

టిడిపి హ‌యాంలో టిటిడి ఆధ్వ‌ర‌యంలో ఆలయం నిర్మాణానికి రూ 130 కోట్ల కేటాయించ‌గా, వైసీపీ అధికారంలోకి రాగానే దీనిని రూ 30 కోట్లకు కుదించారు. ఆ త‌రువాత అమ‌రావ‌తి రాజ‌ధానికే స‌మాధి క‌ట్ట‌డం ఆరంభించారు. రాజ‌ధానే లేన‌ప్పుడు  ఇంకా శ్రీవారి ఆల‌యం కూడా లేన‌ట్టే! 

అయితే ఈ 25 ఎక‌రాలు భూములు క్రైస్త‌వ మిష‌న‌రీ అప్ప‌గించే కుట్ర‌కు తెర‌తీసిన్నట్లు ఆరోపణలు చెలరేగుతున్నాయి.  రాజ‌ధాని ప్రాంతంలో రైతులంతా ఒకే కులానికి చెందిన‌వార‌ని ఎంత ప్ర‌చారం చేసినా వాస్త‌వం వేరేలా వుంది. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు అత్య‌ధిక సంఖ్య‌లో వుండ‌టం, వారు కూడా చిన్న‌,స‌న్న‌కారు రైతులు కూలీలే కావడం గమనార్హం. 

వీరిని రాజ‌ధాని ఉద్య‌మం నుంచి త‌ప్పించాలంటే మ‌తం మ‌త్తుని ప్ర‌యోగించ‌డ‌మే స‌రైన మార్గంగా ముఖ్యమంత్రి కుటుంభం వ్యూహం రూపొందించిన్నట్లు కనిపిస్తున్నది. బైబిల్‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్‌లాంటి త‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మిని ముఖ్యమంత్రి అందుకు రంగంలోకి దింపారు. 

ఇటీవ‌లే జగన్ మోహన్ రెడ్డి త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి, త‌న అల్లుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్, బంధువు క్రిస్టోఫ‌ర్ ల‌తో క‌లిసి అమరావతి ప్రాంతంలో అత్యంత ప‌క‌డ్బందీ బందోబ‌స్తు  మ‌ధ్య‌ పర్యటించారు. రోజంతా రాజధాని ప్రాంత‌మంతా కలయ తిరిగారు.   సీడ్ యాక్సెస్ రోడ్ మీదుగా ప్ర‌యాణం సాగించి టిటిడి ఆల‌యం నిర్మించ‌త‌ల‌పెట్టిన స్థ‌లాన్ని ప‌రిశీలించారు. 

భారీగా య‌వ్వ‌న‌స్తుల కూడిక‌, గుడారాల పండ‌గ‌లు చేసుకునేందుకు అనువైన స్థ‌ల‌మ‌ని, ఎన్ని వేల  మంది వ‌చ్చినా, ఎన్ని వంద‌ల కార్లు వ‌చ్చినా పార్కింగ్ స‌మ‌స్య వుండ‌ద‌ని ఈ స్థ‌లాన్ని ఎంపిక చేశార‌ని చెబుతున్నారు.  క్రైస్త‌వ ప్రార్థ‌న మందిరాలతోపాటు, ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుపేద‌ల‌కు వైద్యం, విద్య అందించే సంస్థ‌లు ఏర్పాటు చేయ‌డం ద్వారా రాజ‌ధాని ఉద్య‌మానికి వారిని దూరం చేయాల‌నే ఎత్తుగ‌డ వుంద‌ని తెలుస్తోంది. 

మ‌త‌మార్పిడులు ల‌క్ష్యంగా, అమ‌రావ‌తి రాజ‌ధాని ఉద్య‌మానికి బాస‌ట‌గా నిలిచిన ద‌ళితులు, బ‌డుగు బ‌ల‌హీన‌వ‌ర్గాల‌ను దూరం చేసేందుకు బ్ర‌ద‌ర్‌ అనిల్ కుమార్ సొంత సంస్థ అయిన క్రిస్టియ‌న్ మిష‌నరీ అనిల్ వ‌ర‌ల్డ్ ఎవాంజెలిజంకి ఈ భూములు క‌ట్ట‌బెట్టేందుకు రంగం సిద్ధం అవుతోంద‌ని ఆరోపణలు వినవస్తున్నాయి.