ముగ్గురికి భౌతికశాస్త్రంలో నోబెల్ 

భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ విజేత‌ల‌ను ప్ర‌క‌టించారు.  ఫిజిక్స్ పుర‌స్కారాన్ని ముగ్గురికి ఇవ్వ‌నున్నారు.  అవార్డును రెండు భాగాలు చేసిన రాయ‌ల్ స్వీడిష్ అకాడ‌మీ.. ఒక భాగం అవార్డును  రోజ‌ర్ పెన్‌రోజ్‌కు ఇవ్వ‌నున్న‌ది. మ‌రో భాగాన్ని రీన్‌హార్డ్ గెంజెల్‌, ఆండ్రియా గేజ్‌ల‌కు సంయుక్తంగా అందించ‌నున్నారు.

భౌతిక‌శాస్త్ర‌వేత్త రోజ‌ర్ ఫెన్‌రోజ్‌ త‌న ప‌రిశోధ‌న‌లో సాపేక్ష సిద్ధాంతం ఆధారంగా కృష్ణబిలం ఏర్ప‌డిన‌ట్లు నిర్ధారించారు.  సువిశాల విశ్వంలోని పాల‌పుంత మ‌ధ్య‌లో ఉన్న బ్లాక్‌హోల్ గురించి ఆస‌క్తిక‌ర అంశాలు క‌నుగొన్నందుకు శాస్త్ర‌వేత్త‌లు రీన్‌హార్డ్ గెంజెల్‌, ఆండియా గేజ్‌ల‌ను ఎంపిక చేశారు.

ఈ ముగ్గురు శాస్త్ర‌వేత్త‌లు ఈసారి భౌతిక శాస్త్రంలో నోబెల్‌ను ద‌క్కించుకున్నారు.  విశ్వంలో అత్యంత  అసాధార‌ణ‌మైన విష‌యాన్ని వాళ్లు గుర్తించిన‌ట్లు స్వీడెష్ అకాడ‌మీ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది.

అల్బ‌ర్ట్ ఐన్‌స్టీన్‌కు చెందిన సాపేక్ష సిద్ధాంతాన్ని విశ్లేషించేందుకు అత్యంత క్లిష్ట‌మైన గ‌ణిత ప‌ద్ధ‌తుల‌ను రోజ‌ర్ ఫెన్‌రోజ్ డెవ‌ల‌ప్ చేశారు. సాపేక్ష సిద్ధాంతం వ‌ల్లే బ్లాక్ హోల్స్ ఏర్ప‌డుతాయ‌ని ఆయ‌న రుజువు చేశారు.

త‌మ ద‌గ్గ‌ర నుంచి వెళ్లే వ‌స్తువైనా, కాంతినైనా బ్లాక్ హోల్స్ ఇట్టే ప‌ట్టేస్తాయ‌ని అంద‌రికీ తెలిసిందే. అయితే అసాధార‌ణ అంశంపై ఫెన్‌రోజ్ స‌మ‌గ్ర ప‌రిశోధ‌న చేసిన‌ట్లు స్వీడిష్ అకాడ‌మీ చెప్పింది.

మ‌న పాల‌పుంత స‌మూహంలో ఉన్న న‌క్ష‌త్రాల వ‌ద్ద క‌నిపించ‌ని, భారీ వ‌స్తువులు తిరుగుతున్న‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు రీన్‌హార్డ్ గెంజెల్‌, ఆండ్రియా గేజ్‌లు గుర్తించారు. సూప‌ర్‌మాసివ్ బ్లాక్‌హోల్ గురించి ఈ ఇద్ద‌రూ త‌మ ప‌రిశోధ‌న‌ల్లో ప‌లు వివ‌ర‌ణ‌లు ఇచ్చారు.