రాష్ట్రాలకు రూ 20,000 కోట్ల జీఎస్టీ పరిహారం

జీఎస్టీ పరిహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరుగుతున్న వివాదం ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది.  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నేతృత్వంలో సోమవారం భేటీ అయిన 42వ జీఎస్టీ మండలి సమావేశం  ఏకంగా 8 గంటల పాటు జరిగింది. ఈ క్రమంలోనే  రాత్రే ఈ ఏడాది జీఎస్టీ పరిహార బకాయిల్లో భాగంగా రాష్ర్టాలకు రూ.20 వేల కోట్లు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించింది.   
 
2017-18కి గాను ఐజీఎస్టీ వాటాను తక్కువగా అందుకున్న రాష్ర్టాలకు వచ్చే వారం కేంద్రం రూ.24 వేల కోట్లు ఇస్తుందని ఆర్ధిక మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది ఇప్పటిదాకా వసూలైన రూ.20 వేల కోట్లను అన్ని రాష్ట్రాలకు ఈ రాత్రే పంపిణీ చేస్తామని చెప్పారు. 
 
ఏప్రిల్‌-జూలై మధ్య రాష్ట్రాలకు పరిహారం రూ.1.51 లక్షల కోట్లుగా ఉందని పేర్కొన్నారు. ఇక జీఎస్టీ వసూళ్లలో తగ్గుదలను అధిగమించడానికి గతంలో తాము సూచించిన రెండు మార్గాల్లో 21 రాష్ట్రాలు ఏదో ఒకదాన్ని ఎంచుకున్నాయని చెప్పారు. కానీ కొన్ని రాష్ర్టాలు ఇందులో ఏ మార్గాన్నీ ఎంచుకోలేదని తెలిపారు.
 
జీఎస్టీ సెస్‌ను ఐదేళ్ల పాటు చెల్లించేందుకు గతంలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల మధ్య అంగీకారం కుదరగా మరికొంత కాలం పొడిగించాలని నిర్ణయించారు.  జీఎస్టీ అమలుతో రాష్ట్రాలకు వాటిల్లుతున్న ఆదాయ నష్టాలను భర్తీ చేయడానికి కేంద్రం ఈ సెస్సును తెచ్చిన విషయం తెలిసిందే. 
 
నిజానికి తొలి ఐదేండ్ల వరకే ఈ సెస్సు ఉంటుందని జీఎస్టీ అమలు నాడు కేంద్రం చెప్పింది. అయితే ఇప్పుడు దీన్ని పొడిగించేందుకు కౌన్సిల్‌ అంగీకరించింది. ఆశించిన స్థాయిలో జీఎస్టీ నెలసరి వసూళ్లు లేకపోవడం, రాష్ట్రాలకు నష్టం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
 
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్స్‌పై సమావేశంలో ముందుగా చర్చించారు. 
పరిహారం మొత్తం కేంద్రమే చెల్లించాలని, పరిహారం పొందడం రాష్ట్రాల చట్టబద్ధమైన హక్కు అని పలు రాష్ట్రాల ఆర్థిక మంత్రులు కేంద్రాన్ని కోరారు.  ఈ నెల 12న మరోసారి సమావేశం కావాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. 
 
ఇదిలావుంటే ఈ ఆర్థిక సంవత్సరం జీఎస్టీ ఆదాయం క్షీణతను రూ.1.10 లక్షల కోట్లుగా అంచనా వేయాలన్న పలురాష్ట్రాల డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. గతంలో రూ.97 వేల కోట్లుగానే అంచనా వేయగా, ఆర్బీఐ ప్రత్యేక విండో ద్వారా రాష్ట్రాలు ఈ మొత్తాన్ని రుణాలుగా తీసుకోవచ్చని కేంద్రం సూచించిన విషయం తెలిసిందే. 
 
ఇప్పుడు కేంద్రం అంగీకారంతో రూ.1.10 లక్షల కోట్లను ఆర్బీఐ నుంచి రుణాలుగా తీసుకునేందుకు రాష్ట్రాలకు అవకాశం కలిగింది. అలాగే మొత్తం రూ.2.35 లక్షల కోట్ల జీఎస్టీ ఆదాయ లోటును మార్కెట్‌ ద్వారా సమీకరించుకోవచ్చని కూడా రాష్ట్రాలకు కేంద్రం సూచించడం తెలిసిందే.
 
దేశీయంగా శాటిలైట్ల తయారీ, ప్రారంభాలను ప్రోత్సహించేలా కౌన్సిల్‌ నిర్ణయం తీసుకున్నది. ఇస్రో, ఆంట్రిక్స్‌, ఎన్‌ఎస్‌ఐఎల్‌ ద్వారా జరిగే శాటిలైట్‌ ప్రారంభోత్సవ సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపునిచ్చారు. 
 
  స్వల్ప మొత్తాల్లో పన్ను చెల్లింపుదారులకు తాజా సమావేశంలో జీఎస్టీ మండలి ఊరటనిచ్చింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి చిన్నతరహా పన్ను చెల్లింపుదారులు నెలనెలా రిటర్నులు దాఖలు చేయాల్సిన అవసరం లేదని ప్రకటించింది. అయితే పన్ను చెల్లింపులు చలాన్‌ ద్వారా నెలనెలా చేసుకోవాలని ఆర్థిక కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే ఈ సందర్భంగా తెలిపారు.