ఢిల్లీలో పేలుళ్ల కుట్రను ఛేదించిన పోలీసులు  

దేశ రాజధాని ఢిల్లీలో పోలీసుల స్పెషల్ సెల్ పెద్ద విజయాన్ని సాధించింది. దుర్గా పూజ సందర్భంగా ఢిల్లీలో పేలుళ్ల కుట్రను పోలీసులు ఛేదించారు. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఈ ఉగ్రవాదులందరూ గజవత్ ఉల్ హింద్‌కు చెందినవారుగా గుర్తించారు.
ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, అల్-ఖైదా ఇటీవల గజవత్‌ ఉల్‌ హింద్‌ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలో శిక్షణ పొందిన ఉగ్రవాదులు గత నెల 29 న ఢిల్లీకి వచ్చారు. వస్తూ వస్తూ మార్గమధ్యంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి సేకరించారు. ఇంటెలిజెన్స్‌ సంస్థలు వీరి రాకకు సంబంధించిన సమాచారాన్ని ఢిల్లీ పోలీసులతో పాటు పలు భద్రతా సంస్థలకు చేరవేసి అప్రమత్తం చేసింది.
దేశ రాజధానిలో ఉగ్రవాద దాడికి వారు కుట్రపన్నినట్లు అందిన సమాచారం మేరకు అప్రమత్తమై తనిఖీలు చేపట్టిన ఢిల్లీకి చెందిన స్పెషల్‌ సెల్‌ పోలీసులు ఒక ఇంట్లో ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి నాలుగు పిస్టల్స్, 120 క్యాట్రిడ్జులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురూ జమ్ముకశ్మీర్‌కు చెందినవారు. దసరా పర్వదినం సందర్బంగా దుర్గ పూజకు ముందు ఢిల్లీలో పేలుళ్లు జరుపాలన్నది వీరి ప్రణాళికగా తెలిసింది.
నలుగురు ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయడంతో దసరా పండుగ సందర్బంగా పేలుళ్ల దాడి తప్పినట్లయింది. అరెస్ట్‌ చేసిన ఈ నలుగురిని కోర్టులో హాజరుపరిచి ప్రశ్నించేందుకు పోలీసులు తమ రిమాండ్‌లోకి తీసుకున్నారు.