కేసీఆర్ లేఖపై బండి సంజయ్ అభ్యంతరం 

కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేఖావత్ కు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వ్రాసిన లేఖ పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ  లేఖ పూర్తిగా అసత్యాలతో ఉందని, తన వైఫల్యాలకు, కేంద్రాన్ని నిందిస్తున్నట్లుగా స్పష్టంగా అర్థమవుతోందని కేసీఆర్ కు వ్రాసిన లేఖలో విమర్శించారు. 
 
“మీరు పోతిరెడ్డిపాడు సమస్యపై, తగిన సమయంలో స్పందించకుండా ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను మీరు తుంగలోకి తొక్కుతున్నారన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు” అంటూ తాను అడిగే 11 ప్రశ్నలకు సమాధానాలు చెప్పి నిజనిజాలను తెలంగాణ ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
 
పోతిరెడ్డిపాడు లేదా వేరే నీటి సంబంధిత సమస్యలపై మీరు ఇప్పటివరకు కేంద్రానికి ఏ లేఖ రాయలేదనేది నిజం కాదా? మీరు గత 6 సంవత్సరాలుగా మీ ఫామ్ హౌస్‌లో నిద్రిస్తూ ఇప్పుడు మేల్కొన్నట్లు అనిపిస్తుందా? అంటూ సంజయ్ నిలదీశారు. 
గత మే 5న కృష్ణానదిలోని శ్రీశైలం రిజర్వాయర్ నుండి రోజుకు ఆరు నుంచి ఎనిమిది టీఎంసీల నీటిని అదనంగా తీసుకోవటానికి, సంగమేశ్వరమైడ్ వద్ద పోతిరెడ్డిపాడు విస్తరణ, రాయలసీమ ఎల్ఐఎస్ నిర్మాణానికి పరిపాలనా ఆమోదం అందించేలా ఏపీ ప్రభుత్వం జీఓ నెంబర్ 203 జారీ చేసింది. ఈ అక్రమ ప్రాజెక్టును ఆపడానికి మీరు ఇప్పటివరకు ఏమి చేస్తున్నారు? దీనిపై మీరు కేంద్రానికి ఒక్క లేఖ కూడా రాయలేదే అని ప్రశ్నించారు. 
 
ఈ విషయమై తాను వ్రాసిన లేఖకు స్పందించి కేంద్రం ఆగష్టు 5న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలనీ చూస్తే ఈ సమావేశాన్ని వాయిదా వేయమని కోరడం ద్వారా ఏపీ ప్రభుత్వం టెండర్ పక్రియ పూర్తి చేసేందుకు దోహదపడ్డారు గదా అని సంజయ్ కేసీఆర్ ను నిలదీశారు.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో చేతులు కలిపి ఉద్దేశ్యపూర్వకంగా టెండర్ పక్రియ పూర్తి కావడానికి సహకరించి ఇప్పుడు ఆ పొరపాటును కేంద్రంపై నెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాంట్రాక్టర్ల ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తూ ప్రజలకు కాకమ్మ కధలు చెప్పి మోసగించడం ద్వారా రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు.
అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో అన్ని విషయాలను ప్రస్తావించే అవకాశం ఉండగా సమావేశానికి రెండు రోజుల ముందు కేంద్ర మంత్రికి లేఖ వ్రాయడంలో ఔచిత్యం ఏమిటని సంజయ్ ప్రశ్నించారు.  ఇది ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆడుతున్న నాటకాలు మాత్రమే తప్ప మరోటి కాదని స్పష్టం చేశారు.