కోవిడ్‌ కోసం మేధో సంపత్తి హక్కులు ఎత్తివేయాలి 

కోవిడ్-19 కట్టడి, నిరోధం, చికిత్సల కోసం మేధో సంపత్తి హక్కుల నిబంధనల్లో కొన్నిటిని రద్దు చేయాలని భారత దేశం, దక్షిణాఫ్రికా కోరాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే, కోవిడ్-19 వ్యాక్సిన్లు, థెరప్యూటిక్స్, డయాగ్నొస్టిక్ టెస్టులకు సంబంధించిన ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని సులువుగా బదిలీ చేయవచ్చు. 

కోవిడ్ సంబంధిత వ్యాక్సిన్లు, రోగ నిర్థరణ వంటివాటికి సంబంధించిన పేటెంట్లు, కాపీరైట్, పారిశ్రామిక డిజైన్లు, వెల్లడించకుండా వదిలిపెట్టిన సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపార రహస్యాలు వంటివాటిని బదిలీ చేయడానికి వీలవుతుంది.

కోవిడ్-19 రోగ నిర్థరణ ప్రక్రియలు,  మోనోక్లోనల్ యాంటీబాడీస్‌ సులువుగా అందుబాటులో ఉండాలని భారత్, దక్షిణాఫ్రికా కోరాయి. కోవిడ్-19 వ్యాక్సిన్లను స్థానికంగా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉండాలని తెలిపాయి. సుదీర్ఘ కాలం మేధో సంపత్తి హక్కుల కోసం చర్చలు జరపవలసిన అవసరం ఉండకూడదని పేర్కొన్నాయి. 

కోవిడ్-19కు వ్యాక్సిన్లు, మందులు వంటివి ప్రజలందరికీ సకాలంలో అందుబాటులోకి రాకుండా చేయగలిగే అడ్డంకులేవీ ఉండకూడదని భారత్, దక్షిణాఫ్రికా స్పష్టం చేశాయి. 

డబ్ల్యూటీవో సభ్యులంతా కలిసికట్టుగా కృషి చేసి, పేటెంట్లు, ఇండస్ట్రియల్ డిజైన్స్, కాపీరైట్ వంటివి అడ్డంకులుగా మారకుండా చర్యలు తీసుకోవాలని డబ్ల్యూటీవోలోని మేధో హక్కుల వ్యాపార సంబంధిత అంశాల మండలిని కోరాయి.