గిరిజన ఉత్పత్తులకు ఈ -మార్కెట్ వేదిక    

గిరిజనుల హస్తకళా ఉత్పాదనలకు, సేంద్రియ ఉత్పత్తుల అమ్మకానికి ట్రైబ్స్ ఇండియా దేశంలోనే అతిపెద్ద ఈ -మార్కెట్ వేదికను ఏర్పాటు చేసింది. గిరిజనులకు జీవనోపాధి అందించేందుకు ట్రైబ్స్ ఇండియా ముందుకు వచ్చింది.
ట్రైబ్స్ ఇండియా  కొత్తగా రూపొందించిన ఈ-మార్కెట్ వేదిక market.tribesindia.comను కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా ప్రారంభించారు.
“కరోనా మహమ్మారి ప్రబలినప్పటికీ, గిరిజనుల సామాజిక ఆర్థికాభివృద్ధి అనే ప్రధాన లక్ష్య సాధనకే భారతీయ గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి సమాఖ్య (ట్రైఫెడ్) పనిచేసింది. గిరిజనుల జీవితాల్లో కొత్త తరహా సాధారణ పరిస్థితులు నెలకొనేలా ట్రైఫెడ్ కృషి చేసిందని అర్జున్ ముండా తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ కింద దేశాన్ని స్వావలంబన దిశగా తీసుకువెళ్లాలన్న ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ట్రైబ్స్ ఇండియా ఈ-మార్కెట్ వేదికను రూపొందించింది. గిరిజనులకు అండగా ట్రైఫెడ్ చేపట్టిన పలు కార్యక్రమాలను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి అర్జున్ ముండా లాంఛనంగా ప్రారంభించారు.
రుషీకేశ్ లో ట్రైబ్స్ ఇండియా 123వ దుకాణాన్ని, కోల్కతాలో 124వ అవుట్ లెట్ ను ఆయన ప్రారంభించారు. జార్ఖండ్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలనుంచి రెండు కొత్త ఉత్పాదనలను కూడా లాంఛనంగా ప్రకటించారు. గిరిజన ఉత్పాదనల విక్రయ కార్యక్రమంలో భాగంగా అమెజాన్ సంస్థతో ట్రైఫెడ్, ట్రైబ్స్ ఇండియా భాగస్వామ్యాన్ని ప్రకటించారు.
జార్ఖండ్ లోని పాకూర్ ప్రాంతపు వందశాతం సహజసిద్ధమైన తాజా అటవీ ఉత్పత్తి అయిన తేనె విక్రయాన్ని ప్రారంభించారు. జార్ఖండ్ లోని పహాడియా తెగలవారు ఈ తేనెను ఉత్పత్తి చేస్తారు. ట్రైఫెడ్ కోసం వారు 3 టన్నుల పాకూరు తేనెను ఉత్పత్తి చేశారు.