టీఆర్ఎస్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువు  

టిఆర్ఎస్ లో పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పక్రియ ప్రారంభం కావడంతో అధికార పక్షంలో కలవరం చెలరేగుతుంది. వచ్చే ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ రామచంద్రరావుల పదవీకాలం కాలం ముగుస్తుంది. 

ఈ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమం అక్టోబర్ 1 నుంచి మొదలవుతోంది. ఐతే ఇప్పటికే ఓటరు నమోదు కార్యక్రమం కోసం కార్యకర్తలతో సమాలోచనలు జరిపిన  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఫీడ్ బ్యాక్ చూసి ఆందోళన చెందుతున్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులలో పార్టీ పట్ల వ్యతిరేకత ఉందని కార్యకర్తలు స్పష్టంగా పెద్ద నాయకులకు చెబుతున్నారు.

దీంతో ఓటర్ల నమోదు కార్యక్రమం చేపట్టిన పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని భావిస్తున్నారు. వచ్చే గ్రాడ్యుయేట్స్‌‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుసుడు కష్టమేనని టీఆర్ఎస్ నేతలలోనే చర్చ జరుగుతోంది.  ఉద్యమ సమయంలో ఉన్న పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని చెబుతున్నారు. 

2018 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచినప్పటికీ ఆ వెంటనే జరిగిన కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఓడిపోయారు. 2015 లోనూ జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డి అతి కష్టం మీద బయటపడ్డారు. 

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నుంచి పోటీచేసిన దేవిప్రసాద్ ఓడిపోయారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, టీచర్ల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదంటూ టీఆర్ఎస్ నేతలే వాపోతున్నారు. ఆ వ్యతిరేకతను తట్టుకొని గెలవటం సాధ్యం కాదని ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు.

గ్రాడ్యుయేట్స్‌‌ ఎన్నికలలో పోటీ చేసేందుకే అభ్యర్థులు భయపడుతున్నట్లు టీఆర్ఎస్ లో అంతర్గతంగా చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మళ్లీ పోటీ చేసేందుకు సిద్దంగా లేరని, పోటీ చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో ఆయనకు తెలుసని ఎన్నికలు జరిగే జిల్లాలకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే తెలిపారు.

‘‘పోటీ చేయనని పల్లా స్వయంగా పార్టీ పెద్దలకు చెప్పారు. ఒకవేళ ఆయన పోటీ చేస్తే ఆ మూడు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు సహకరించరు.  ఆయనపై వ్యతిరేకత ఉంది’’ అని  ఆ ఎమ్మెల్యే వివరించారు. 

మండలి ఏర్పాటు తర్వాత ఇప్పటి వరకు హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి టీఆర్ఎస్ గెలవలేదు. ఈ నియోజకవర్గం నుంచి  హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ ను  పోటీకి దింపాలని పార్టీ భావిస్తోంది. అయితే ఆయనకు కూడా పోటీ చేయటం ఇష్టం లేదని తెలుస్తున్నది. 

మరోవంక గతంలో సిపిఎం మద్దతుతో రెండుసార్లు గెలుపొంది, పదేళ్ళపాటు ఎమ్యెల్సీగా ఉన్న నాగేశ్వర్ ను స్వతంత్ర అభ్యర్థిగా దింపి, బలపరచాలని ఆలోచన కూడా అధికార పక్షంలో నడుస్తున్నది. గత ఎన్నికలలో గెలుపొందలేమని భావించి ఆయన పోటీ చేయలేదు.