ఆర్ధిక పారదర్శకత లేకనే ఆమ్నెస్టీ మూసివేత 

చలసాని నరేంద్ర 
అంతర్జాతీయంగా మొదటిసారి మానవహక్కుల గురించి స్వరం వినిపించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మారుతున్న పరిష్టితులలో తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయా? భారత దేశంలో తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించడం గమనిస్తే, కొంతకాలంగా ఆ సంస్థ పనిచేస్తున్న తీరు గమనిస్తే ఇటువంటి అభిప్రాయమే కలుగుతున్నది. 
 
కేవలం తాము జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ అల్లర్లకు సంబంధించి కేంద్రంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలు ఇస్తూ ఉండటం కారణంగానే కక్షసాధింపుగా తమ బ్యాంకు ఖాతాలను స్తంభింప చేసారని అంటూ ఈ సందర్భంగా ఆ సంస్థ భారత దేశ కార్యనిర్వాహక డైరెక్టర్ అవినాష్ కుమార్ చేసిన ప్రకటన కేవలం తమ బలహీనతలను కప్పిపుచ్చుకొనే ప్రయత్నంగానే కనిపిస్తున్నది. 
 
నరేంద్ర మోదీ ప్రభుత్వమే కాదు, అంతకు ముందున్న ప్రభుత్వాలు సహితం, అమెరికా వంటి ప్రజాస్వామ్య దేశాలు సహితం ప్రజల హక్కుల గురించి నిలదీసే ప్రయత్నం చేస్తే సహించలేవు. మానవ, పౌర హక్కుల సంస్థలు ఏవీ ప్రభుత్వాల అండదండలతో పనిచేయలేవు. అయితే ఆ విధంగా బలమైన ప్రభుత్వాలను నిలదీసే ముందు తమ కార్యకలాపాలు, ముఖ్యంగా ఆర్ధిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండేటట్లు చూసుకోవాల్సి ఉంది. ఈ విషయంలోనే ఆమ్నెస్టీ గత రెండున్నర దశాబ్దాలుగా భారత్ లో విఫలం అవుతూ వస్తున్నది. 
 
1961లో పోర్చుగీస్ లో నిర్బంధంలో ఉన్న ఆరుగురు ప్రజాస్వామ్య కార్యకర్తల విడుదల కోరుతూ అంతర్జాతీయ ప్రచార ఉద్యమంగా వివిధ దేశాల నుండి ఆ దేశ ప్రభుత్వానికి లేఖలు వ్రాయిస్తూ బ్రిటిష్ న్యాయవాది పీటర్ బెన్సన్ చేసిన ప్రయత్నంతో ఈ మహా ఉద్యమం ప్రారంభమైనది. 
 
అప్పటి నుండి కేవలం విశ్వాసం కలిగి, హింసాయుత కార్యక్రమాలతో సంబంధం లేకుండా లేదా హింసను ప్రబోధించకుండా ఉన్న ఖైదీల విడుదలకు వివిధ దేశాల నుండి ఉత్తరాలు వ్రాయించడం ఈ సంస్థ మౌలిక కార్యక్రమంగా ఉంటూ వచ్చింది. 
 
మొదటి నుండి స్థానిక దేశాల రాజకీయాలతో సంబంధం లేకుండా, స్థానిక చట్టాలను గౌరవిస్తూ వాటి పరిధిలో పనిచేస్తూ వచ్చింది. అయితే రాను, రాను మానవహక్కుల ఉద్యమకారులతో సంబంధం లేకుండా, ఒక వృత్తిగా స్వీకరించేవారు ఆధిపత్యంలో ఈ సంస్థ స్వరూపం మారుతూ వచ్చింది. 
 
దక్షిణ ఆఫ్రికాలో వివక్షతకు వ్యతిరేకంగా పోరాడినప్పటికీ, కోర్ట్ హాలులో హింసను సమర్ధిస్తూ మాట్లాడారని నెల్సన్ మండేలా విడుదలకు వ్యక్తిగతంగా ప్రచారం జరపలేదు. అంతటి నిబద్దత ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ భారత దేశంలో గత నాలు గైదు దశాబ్డల కాలంగా స్థానిక చట్టాల పరిధిలో పనిచేయలేక అడ్డదారులు వెతుక్కొని ప్రయత్నం చేస్తూ వస్తున్నది. 
 
ఈ సంస్థపై ఆర్ధికపరమైన ఉల్లంఘనలకు పాలపడిన్నట్లు 2010 నుండి ఆరోపణలు వస్తున్నాయి. గతంలో యుపిఎ ప్రభుత్వ హయాంలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నది. 2010లో చిదంబరం హోమ్ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ఎఫ్ సి ఆర్ ఐ చట్టం క్రింద ఇప్పటి వరకు ఎందుకని నమోదు చేసుకోలేదు? ఆర్ధిక వ్యవహారాలలో మొదటి నుండి పారదర్శకత పాటించక పోవడం అందుకు తార్కాణం. 
 
భారత్ వంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో సభ్యత్వం లేకుండా, స్థానికంగా సభ్యులు ఎన్నుకున్న కమిటీలు లేకుండా లండన్ నుండి నియమించిన ఉద్యోగుల సారధ్యంలో ఇక్కడ కార్యక్రమాలు నడపడం చూస్తే వారు లండన్ కార్యాలయం  ప్రయోజనాలకోసమే పనిచేస్తారని స్పష్టం అవుతుంది. పైగా ఇక్కడ రాజకీయంగా పక్షపాత ధోరణులు ఆవలంభిస్తున్న వారికి కీలక స్థానం కల్పించడం ఎటువంటి సందేశం ఇస్తుంది?
 
ఐరోపా, అమెరికా లలో వలే సాంస్కృతిక సంస్థల వలే కాకుండా మానవ, పౌర హక్కుల సంస్థలు, ఉద్యమాలను భారత్ వంటి ఆసియా దేశాలలో అంకిత భావంతో, ఒక జీవిత కార్యంగా నిర్వహిస్తుంటారు. కానీ ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో కేవలం ఉద్యోగంగా వచ్చిన వారితో ఇటువంటి ఉద్యమాన్ని నడిపే ప్రయత్నం చేయడంతోనే సవ్యంగా పనిచేయలేక అపోతున్నది. 
 
సభ్యులు ఎన్నుకున్న భారత విభాగాన్ని 1999లో ఎందుకు రద్దు చేయవలసి వచ్చింది? ఆర్ధిక వ్యవహారాలలో పారదర్శకత లేకపోవడం వల్లననే గదా. అటువంటి పొరపాట్లు చేస్తూ ఉండడం కారణంగా తిరిగి అధికారికంగా భారత్ విభాగం ఏర్పాటు చేయలేక పోయారు. గత పదేళ్లుగా కనీసం సభ్యులు కూడా లేకుండా పని చేస్తున్నారు. కంపెనీల క్రింద నమోదయి పనిచేయవలసి దుస్థితి ఏర్పడడం ఆ సంస్థ ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలకు అద్దం పడుతున్నది. 
 
ప్రపంచం వ్యాప్తంగా ఐదుగురు సభ్యులు కనీసంగా ఒక బృందంగా ఏర్పడి ఖైదీల విడుదలకు ఉత్తరాలు వ్రాస్తుండటం, వారి విడుదల కోసం ప్రచారం చేబడుతూ ఉండటం చేసే పనులకు ఇప్పుడు ప్రాధాన్యత లభించడం లేదు. పైగా ఒక దేశంలోని ఉన్న సభ్యులు ఆ దేశంలోని మానవహక్కుల ఉల్లంఘనల గురించి మాట్లాడేవారు కాదు. కేవలం మరణ శిక్షలు,  చట్టాలలో సంస్కరణలు, వ్యవస్థాగత అంశాలు, చిత్రహింసలు వంటి విధానపర అంశాల గురించి మాత్రమే మాట్లాడాలి. 
 
కానీ భారత దేశంలో స్థానిక రాజకీయ ఉద్యమాలలో భాగం వలే కొన్ని అంశాలలో వ్యవహరిస్తూ వస్తున్నారు. మానవహక్కుల ఉల్లంఘనల విషయంలో సహితం ఎంపిక చేసి స్పందిస్తున్నారనే ఆరోపణలు చిరకాలంగా ఉంటూ వచ్చాయి. ఎందుకనో భారత్ వ్యతిరేక విధానాలను లండన్ లోని వారు అవలంభిస్తున్నారనే ప్రచారం జరుగుతున్నది. 
 
పొరుగున ఉన్న నేపాల్ లో ఒకానొక సమయంలో ఆమ్నెస్టీ సభ్యులు నేపాల్ కాంగ్రెస్ అనుకూల, చైనా అనుకూల వర్గాలుగా విడిపోతే,  అక్కడ చైనా అనుకూల వర్గం వారికి ఆ దేశంలో నాయకత్వం అప్పజెప్పాలని 1990లోవిఫల ప్రయత్నం చేయలేదా? నేపాల్ కాంగ్రెస్ వారు భారత్ అనుకూలం కావడంతో, వారికి ఆధిపత్యం లభిస్తే దక్షిణ ఆసియాలో భారత్ అనుకూలత ఏర్పడుతుందనే ఆందోళన వారిలో కలిగింది. 
 
అదే విధంగా అయోధ్యలో కరసేవకులపై ములాయంసింగ్ యాదవ్ ప్రభుత్వం దారుణమైన అణచివేత ప్రదర్శించి, పోలీస్ కాల్పులలో లెక్కకు లేనంతమందిని చంపివేస్తే కనీసం ఏమి జరిగిందో తెలుసుకొనే ప్రయత్నం కూడా ఆమ్నెస్టీ చేయలేదు. 
 
ఆ సమయంలో భారత్ పర్యటనకు వచ్చిన నార్వే దేశానికి చెందిన అంతర్జాతీయ కార్యవర్గ సభ్యురాలిని మీడియా ఈ విషయమై ప్రశ్నిస్తే ఈ విషయమై తాము దర్యాప్తు జరుపుతామని అన్నందుకు ఆమెను అంతర్జాతీయ కార్యవర్గ సమావేశంలో నిలదీయలేదా?
 
ఆమ్నెస్టీని ప్రారంభించిన పీటర్ బెన్సన్ సంస్థ ఆర్ధిక వ్యవహారాలు చాల పారదర్శకంగా ఉండాలని కోరుకున్నారు. నిధుల ద్వారా తమ విధానాలపై ఎవ్వరు ప్రభావం చూపరాదనుకొని తమ బడ్జెట్ లో 5 శాతంకు మించి ఒకే వ్యక్తి లేదా సంస్థ నుండి నిధులు స్వీకరింపరాదని ఆంక్షలు విధించారు. అంతేకాకుండా ప్రభుత్వాల నుండి నిధులు స్వీకరించరాదని కూడా నిర్ణయించారు. 
 
ఇలా ఉండగా, ప్రస్తుతం సిబిఐ, ఈడీ కేసులలో ఈ సంస్థ ఆర్ధిక వ్యవహారాల గురించి ప్రశంలు లేవనెత్తడం మినహా సంస్థ ఇతర కార్యక్రమాల నుండి ఎటువంటి  ప్రశ్నలు లేవనెత్తక పోవడం గమనార్హం. సంస్థ ఆర్ధిక వ్యవహారాలపై నేడు కొత్తగా ఆరోపణలు రాలేదు. ఈ ఆరోపణలు సమాధానాలు చెప్పకుండా తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించడం ఎంతవరకు సబబు?

భారత దేశంలో పౌర హక్కుల ఉద్యమానికి ఒక గుర్తింపు తీసుకు వచ్చిన పీయూసీఎల్ విదేశాల నుండి నిధులు స్వీకరించ కూడదని నిర్ణయించుకొంది. వాస్తవానికి కేంద్ర, రాష్టాలలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పౌరహకులపై ఆయా ప్రభుత్వాలను ప్రజా క్షేత్రంలో అనేక సందర్భాలలో ఈ సంస్థ నిలబెడుతూ వస్తున్నది. వారి ఆర్ధిక వ్యవహారాలు పారదర్శకంగా ఉంటూ ఉండడంతొ ప్రభుత్వాలు ఏమీ చేయలేక పోతున్నాయి. 
 
అలాగే హక్కుల విషయమై మహోన్నత ప్రజా ఉద్యమం సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ పై నడిపిన మేధా పట్కర్ సహితం విదేశీ నిధుల స్వీకరణకు వ్యతిరేకం కాబట్టి ఆమెను, ఆమె ఉద్యమాలను ప్రభుత్వాలు దోషిగా నిలబెట్టలేక పోతున్నాయి. భారీగా విదేశాల నుండి నిధుల వస్తే తప్ప ఇక్కడ కార్యకలాపాలు జరపలేకనే ఆమ్నెస్టీ ఇప్పుడు తమ కార్యక్రలాపాలను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించినట్లు గమనించాలి. 
 
ఉద్యమాలు గాని, ప్రభుత్వాలు గాని, సంస్థలు గాని ఆర్ధికంగా మనుగడకు దేశం అవతలి వైపు చూస్తుంటే అవి స్వతంత్రంగా వ్యవహరింపలేవని, దేశ ప్రయోజనాల విషయంలో కూడా రాజీ పడక తప్పదని భావించవలసి వస్తున్నది. హక్కుల గురించి మాట్లాడే ఆమ్నెస్టీ అంతర్గతంగా ఒక ప్రజాస్వామ్య కార్య పద్దతిని ఎందుకు అభివృద్ధి చేసుకోలేక పోతున్నది? 
 
నిధుల విషయంలో తమపై ఆధారపడే విధంగా చేయడం ద్వారా ముఖ్యంగా ఆసియా దేశాలలో స్థానికంగా పునాదులు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండడంతో మానవహక్కుల పట్ల నిబద్దత కలిగిన వారు సహితం వారి పట్ల అనుమానంతో చూడవలసి వస్తున్నది. 
 
మానవహక్కులతో సంబంధం లేని వారిని, సైద్ధాంతికంగా ఆమ్నెస్టీని ఐరోపా దేశాల ఏజెంట్ గా నిందించే వారితో కార్పొరేట్ తరహాలో కార్యకలాపాలు జరపాలి అనుకోవడం ఒక వాణిజ్య నమూనా అవుతుంది కానీ హక్కుల ఉద్యమంగా ఇక్కడ బలోపేతం కాలేదు. 
 
1999లో భారత విభాగాన్ని రద్దు చేయడానికి దారి తీసిన పరిస్థితుల నుండి గుణపాఠం స్వీకరించి, దిద్దుబాటు చర్యలు చేపట్టక పోవడం వల్లననే ఇక్కడ భారీ జీతాలతో, క్షేత్రస్థాయిలో హక్కుల ఉద్యమాలతో సంబంధం లేని వారితో ఉద్యోగులుగా నియమించి స్థానికంగా తనకంటూ ఒక స్థానం పొందలేక పోతున్నది. 
(మన తెలంగాణ నుండి)