ట్రంప్ దంపతులకు కరోనా పాజిటివ్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ లకు కరోనా పాజిటివ్ అని తేలింది.‌ తన సలహాదారుణికి కరోనా పాజిటివ్ అని తేలడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు గురువారం రాత్రి కొవిడ్-19 పరీక్ష చేయించుకున్నారు.ఈ పరీక్షల్లో  డొనాల్డ్ ట్రంప్, మెలానియాలకు పాజిటివ్ అని శుక్రవారం ఉదయం తేలింది. 
 
దీంతో ట్రంప్ దంపతులు క్వారంటైన్ లోకి వెళ్లారు. ట్రంప్ సలహాదారిణి హూప్ హిక్సుకు మొదట కరోనా వైరస్ సోకింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు అతనితో కలిసి హూప్ హిక్సు మంగళవారం ఎయిర్ ఫోర్సు వన్ విమానంలో ప్రయాణించారు.
 
ఈ నేపథ్యంలో ట్రంప్ దంపతులు తాజాగా కరోనా పరీక్ష చేయించుకున్నారు. తాము కరోనా వల్ల క్వారంటైన్‌లోకి వెళ్లామని ట్రంప్ ట్వీట్ చేశారు. ట్రంప్ సలహాదారిణిగా పనిచేస్తున్న హూప్ హిక్సు ట్రంప్‌తో కలిసి ఈ వారంలో ప్రెసిడెన్షియల్ హెలికాప్టర్ మెరైన్‌వన్, ఎయిర్‌ఫోర్స్ వన్ మిన్నెసోటాలో ప్రయాణించారు.
కరోనా సోకి హూప్ అధ్యక్షుడు ట్రంపుతో కలిసి పలుసార్లు ప్రయాణించినందున తాము అధ్యక్షుడి ఆరోగ్యం గురించి పర్యవేక్షిస్తున్నామని వైట్ హౌస్ ప్రతినిధి జాడ్ డీర్ చెప్పారు.
తాను, మెలానియా ట్రంప్ కొవిడ్-19 పరీక్ష ఫలితాల కోసం ఎదురుచూస్తున్నామని, ఈ సమయంలో తాము క్వారంటైనులో ఉన్నామని ట్రంప్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
 ‘‘చిన్న విరామం కూడా తీసుకోకుండా చాలా కష్టపడి పనిచేస్తున్న హోప్ హిక్సుకు కొవిడ్- 19  పాజిటివ్ అని తేలింది. భయంకరమైనది..  నేను, నా భార్య మెలానియాలు కొవిడ్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం. ఈలోగా, మేం క్వారంటైన్  ప్రక్రియ ప్రారంభిస్తున్నాం’’ అని డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.
 
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌లు త్వరగా కోలుకోవాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆకాంక్షించారు. తన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్ త్వరగా కోలుకొని ఆరోగ్యంగా ఉండాలని నరేంద్రమోదీ ట్విట్టరులో ఆకాంక్షించారు