కొత్త వ్యవసాయ చట్టంతో రైతులకు మేలు

కేంద్ర ప్రభుత్వం రూపొందించిన కొత్త వ్యవసాయ చట్టం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. బుధవారం వ్యవసాయ నిపుణులు, వ్యవసాయ సంబంధిత విభాగాల్లో పనిచేసే వారితో వ్యవసాయ చట్టాలు, రైతులపై ప్రభావం అనే అంశంపై వెబ్‌నార్ కార్యక్రమాన్ని గవర్నర్ నిర్వహించారు. 

ఈ సందర్భంగా గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ భారతదేశంలోని వ్యవసాయం కష్టాల్లో ఉందని, మధ్యవర్తుల దోపిడీ, వాతావరణ పరిస్థితులు, రైతుల ఉత్పత్తులకు తక్కువ ధర, తమ ఉత్పత్తులను విక్రయించ డానికి పరిమిత ఎంపికలు వంటి సవాళ్లను రైతులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు ఇప్పటికే పేదరికంతో బాధపడుతున్నారని గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు రైతులను ఆర్థికంగా శక్తివంతంగా చేస్తాయని, వ్యవసాయాన్ని లాభదాయకంగా మారుస్తాయని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ చట్టంతో మార్కెటింగ్ ఎంపికలను ప్రోత్సహించడం, వారి ఉత్పత్తులను పారితోషికం ధర ఇప్పించడం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను అన్వేషించే సాంకేతికత, కాంట్రాక్టు వ్యవసాయంలో రైతులకు రక్షణ కల్పించడం ద్వారా రైతులను శక్తివంతులుగా చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయని తెలిపారు. 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం కనీస మద్ధతు ధర, సేకరణ కొనసాగింపు గురించి రైతుల్లో మరింత అవగాహన కల్పించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. కనీస మద్ధతు ధర, కనీస సేకరణ యధావిధిగా కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టం చేసిందని గవర్నర్ తెలిపారు.

ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవసాయం మరింత పారితోషికం పొందే అవకాశం ఉందని గవర్నర్ పేర్కొన్నారు. వ్యవసాయం మన దేశానికి జీవనాడి ఆమె అభివర్ణించారు.