మతవ్యాప్తిలో అంతర్భాగంగానే ఇంగ్లీష్ మీడియం ! 

కోర్టు తీర్పులను తృణీకరిస్తూ రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమాన్ని నిర్బంధంగా అమలు చేస్తున్న తీరు చూస్తుంటే ఇదంతా మతవ్యాప్తిలో అంతర్భాగంగానే జరుగుతున్నట్లు సందేహం కలుగుతోందని వైసీపీ నరసాపురం ఎంపీ కె రఘురామకృష్ణరాజు ఆరోపించారు. 

ఆంగ్లంలో మాట్లాడినంత మాత్రాన అందరికీ ఉద్యోగాలు రావన్న విషయం గుర్తించాలని ఆయన సూచించారు. నాలుగు ఇంగ్లీష్‌ ముక్కలు మాట్లాడితే ఉద్యోగం వచ్చేస్తే దేశంలో నిరుద్యోగ సమస్యే ఉండకూడదని ఎద్దేవా చేశారు. 

ఆంధ్రప్రదేశ్ లో పేద  ప్రజలను ప్రలోభపెట్టి బలవంతపు మత మార్పిడులకు పాల్పడవద్దని మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న వారికి ఆయన హితవు చెప్పారు. 

దేవాలయాలపై దాడులకు పాల్పడే అసలు దోషులను వదిలి పిచ్చోళ్లపై నేరస్థులుగా ముద్రవేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. కాగా, పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ చైర్మన్‌ పదవి నుంచి తనను తొలగించాలని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ‌ ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పెద్దలను కోరినట్లు తెలిసిందని చెప్పారు. తనను పదవి నుంచి తొలగిస్తారని అనుకోవడం లేదని స్పష్టం చేశారు. 

ఇలా ఉండగా, రాజధానిని మారిస్తే భూములిచ్చిన రైతులందరికీ రూ.1,35,000కోట్ల పరిహారం చెల్లించగలరా అని రఘురామరాజు ప్రశ్నించారు. ప్రభుత్వంతో రైతులు కుదుర్చుకున్న ఒప్పందానికి భిన్నంగా, సీఆర్‌డీఏ చట్టాన్ని తుంగలో తొక్కి రాజధాని మార్పు పేరుతో రైతులకు అన్యాయం చేయడం తగదని స్పష్టం చేశారు.

అమరావతిని రాజధానిగా అంగీకరించినందువల్లే తమ పార్టీని ప్రజలు 151 సీట్లతో గెలిపించారని తెలిపారు.