బాబ్రీ విధ్వంసంలో నిందితులంతా నిర్దోషులే

దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూసిన బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటన ముందుస్తు పథకం ప్రకారం జరిగింది కాదని, పథకం ప్రకారం కూల్చివేసినట్టుగా ఆధారాలు లేవని పేర్కొంది.
లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానంలోని కోర్టు రూమ్‌ నంబరు 18లో సీబీఐ జడ్జి సురేంద్ర కుమార్‌ యాదవ్‌ 2,000 పేజీల తుది తీర్పును చదివి వినిపించారు. సిబిఐ కోర్టుకు అందించిన ఆడియో, వీడియో ఆధారాల వల్ల నిందితులను దోషులేగా తేల్చలేమని కోర్టు స్పష్టం చేసింది. బాబ్రీ మసీదును కూల్చినవారు సంఘ వ్యతిరేకులని కోర్టు అభిప్రాయపడింది.
 
నిందితులపై చేసిన ఆరోపణలు బలంగా లేవని కోర్టు పేర్కొంది.దీంతో ప్రధాన నిందితులుగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎల్కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమా భారతీ సహా 32 మంది నిందితులు నిర్దోషులుగా తేలారు. 28 సంవత్సరాల అనంతరం ఈ కేసులో తుది తీర్పు ఇవాళ వెలువడింది.
అయితే తీర్పు సందర్భంగా 32 మంది నిందితుల్లో 26 మంది మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీతో సహా ఆరుగురు కోర్టుకు హాజరు కాలేదు.
 
1992, డిసెంబరు 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కరసేవకులు కూల్చి వేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో వాదోపవాదనల అనంతరం కోర్టు బుధవారం తీర్పును ఇచ్చింది. ఈ కేసును విచారించిన సీబీఐ  351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది.
48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 16వ శతాబ్దం నాటి బాబ్రీ మసీదుని కూల్చివేతలో పాల్గొన్న కరసేవకుల్ని ఈ కేసులో నిందితులందరూ కుట్ర పన్ని వారిని రెచ్చగొట్టారని సీబీఐ న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించింది. 
 బాబ్రీ మ‌సీదు కేసులో సీబీఐ ప్ర‌త్యేక కోర్టు ఇచ్చిన తీర్పును మ‌న‌స్ఫూర్తిగా స్వాగ‌తిస్తున్నాన‌ని  ఎల్‌కే అద్వానీ ప్రకటించారు. ఈ తీర్పు రామ‌జ‌న్మభూమి ఉద్య‌మం ప‌ట్ల త‌న నిబ‌ద్ద‌త‌తో పాటు బీజేపీ చిత్త‌శుద్ధిని తెలియ‌జేస్తుంద‌ని అద్వానీ పేర్కొన్నారు. ఈ కేసులో అద్వానీ నిర్దోషిగా ప్ర‌క‌టించ‌బ‌డ‌టంతో ఆయ‌న నివాసానికి ప‌లువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయ‌కులు వెళ్లారు.    
 
కోర్టు చ‌రిత్రాత్మ‌క తీర్పును ఇచ్చిన‌ట్లు బీజేపీ సీనియ‌ర్ నేత ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషిచెప్పారు.  అయోధ్య‌లో 1992 డిసెంబ‌ర్ 6వ తేదీన ఎటువంటి కుట్ర జ‌ర‌గ‌లేద‌ని ఈ తీర్పుతో నిర్ధార‌ణ అయిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. తాము నిర్వ‌హించిన కార్య‌క్ర‌మాలు, ర్యాలీల్లో ఎటువంటి కుట్ర లేద‌న్నారు. కోర్టు తీర్పు సంతోషాన్నిచ్చింద‌ని, రామ మందిర నిర్మాణం కోసం ఎదురుచూస్తున్న‌ట్లు జోషి తెలిపారు. 
 
చివ‌రికి న్యాయ‌మే గెలిచింద‌ని ఆయ‌న  ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగీ ఆదిత్య‌నాథ్ సంతోషం వ్య‌క్తంచేశారు.  తాజా తీర్పుతో నాటి కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌ కుటిల నీతి తేల‌తెల్ల‌మైంద‌ని యోగీ విమ‌ర్శించారు. బీజేపీ నేత‌ల ప్ర‌యేమ‌మున్న ఈ కేసు విష‌యంలో కాంగ్రెస్ రాజ‌కీయ ప‌క్ష‌పాతంతో వ్య‌వ‌హ‌రించింద‌ని, ఈ కేసును అడ్డం పెట్టుకుని ఓటు బ్యాంకు రాజ‌కీయాలు చేసింద‌ని ఆయన ఆరోపించారు. 
 
బాబ్రీ కేసును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ దేశంలోని సాధువుల‌ను, బీజేపీ నేత‌ల‌ను, విశ్వ‌హిందూ ప‌రిష‌త్‌తో సంబంధాలున్న సీనియ‌ర్ నేత‌ల‌ను, వివిధ సామాజిక సంస్థ‌ల‌ను వంచ‌న చేసిందని యోగీ ఆదిత్యనాథ్ మండిప‌డ్డారు. సీబీఐ కోర్టు నేప‌థ్యంలో ఇప్ప‌టికైనా కాంగ్రెస్ పార్టీ దేశ ప్ర‌జ‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.