ట్రాక్టర్ల దహనం రైతులను అవమాన పరచడమే 

నూత‌నంగా ఏర్ప‌డిన వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ ఢిల్లీలోని ఇండియా గేటు వ‌ద్ద ట్రాక్ట‌ర్‌ను ద‌హ‌నం చేసిన ఘ‌ట‌న‌ పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.    ఇన్నాళ్లూ పూజించిన మెషీన్లు, ప‌రిక‌రాల‌కు ఇప్పుడు నిప్పుపెట్టి రైతుల‌ను అవ‌మానిస్తున్నార‌ని ఆయ‌న మండిపడ్డారు.

నమామి గంగా మిషన్ కింద ఉత్తరాఖండ్‌లో ఆరు మెగాప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభిస్తూ బహిరంగ మార్కెట్‌లో రైతులు త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునేందుకు ప్ర‌తిప‌క్షాలు అడ్డుప‌డుతున్నాయ‌ని ఆరోపించారు.

మ‌ధ్య‌వ‌ర్తులు, ద‌ళారులు లాభం పొందే విధంగా ప్ర‌తిప‌క్షాల చ‌ర్య‌లు ఉన్నాయ‌ని మోదీ విమ‌ర్శించారు.  రైతుల స్వేచ్ఛ‌ను వారు హ‌రిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు.  ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో రైతులు, కార్మికులు, ఆరోగ్యానికి సంబంధించి సంస్క‌ర‌ణ‌లు తీసుకువ‌చ్చిన‌ట్లు మోదీ తెలిపారు.

తాము తెచ్చిన సంస్క‌ర‌ణ‌ల‌తో కార్మికులు, యువ‌త‌, మ‌హిళ‌లు, రైతులు బ‌లోపేతం అవుతార‌ని ప్ర‌ధాని మోదీ చెప్పారు. కానీ కొంద‌రు త‌మ స్వార్థం కోసం ఎలా ఆ చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తున్నారో దేశ ప్ర‌జ‌లు చూస్తున్నార‌ని ఆయ‌న స్పష్టం చేశారు. ఎక్క‌డైనా, ఎప్పుడైనా, ఎవ‌రికైనా త‌మ ఉత్ప‌త్తుల‌ను అమ్ముకునే హ‌క్కును రైతుల‌కు క‌ల్పించిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు.

రైతుల‌కు తాము హ‌క్కులు క‌ల్పిస్తుంటే.. వాటిని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటున్నాయ‌ని విమ‌ర్శించారు.  క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర‌పై విప‌క్షాలు రైతుల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నాయ‌ని ప్ర‌ధాని ధ్వజమెత్తారు.  ప్ర‌తి పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పిస్తామ‌ని, త‌మ పంట‌ను ఎక్క‌డైనా అమ్ముకునే విధంగా రైతుకు స్వేచ్చ క‌ల్పిస్తామ‌ని ప్ర‌ధాని చెప్పారు.

అయితే కొంద‌రు ఈ స్వేచ్ఛ‌ను త‌ట్టుకోలేక‌పోతున్న‌ట్లు తెలిపారు. న‌ల్ల ధ‌నం ఆర్జించే వారి ప్ర‌య‌త్నాల‌కు గండిప‌డిన‌ట్లు మోదీ ఆరోపించారు.  గ్రామ పంచాయతీలు ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటైన జల్‌జీవన్ మిషన్ లోగోను ఆవిష్కరించారు.

గ్రామ పంచాయితీలో పానీ సమితుల ఏర్పాటు ద్వారా జల్‌జీవన్ పథకాన్ని ప్రభుత్వం రూపాయికే అమలు చేయనుంది. ఉత్తరాఖండ్‌లోని గజీత్ పూర్, హరిద్వార్, రిషికేష్, లక్కడ్ ఘాట్‌లలో ఎస్టీపీలతోపాటు రక్షిత మంచినీటి పథకాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించారు.

హరిద్వార్, రిషికేష్ జోన్లలో 80 శాతం వ్యర్థ జలాలు గంగానదిలో వృథాగా పోతున్నాయి. వాటిని ఎస్టీపీల ద్వారా మళ్లిస్తారు. దీంతో గంగానదిలో కాలుష్యం తగ్గుతుంది. చోర్పానీ, భద్రీనాథ్ ప్రాంతాల్లో మూడు ఎస్టీపీలు ప్రధాని మోదీ ప్రారంభించారు.

అలాగే గంగా అవలోకన్ పేరుతో ఏర్పాటైన మ్యూజియాన్ని ఆయన ప్రారంభించారు. హరిద్వార్‌లోని చండీఘాట్‌లో ఈ మ్యూజియాన్ని నెలకొల్పారు. క్లీన్ గంగా ప్రాజెక్టులతోపాటు వన్యప్రాణుల సంస్థకు మోదీ శ్రీకారం చుట్టారు.