వ్యవసాయ చట్టాలతో రైతుల స్వయం సమృద్ధి

కొత్త వ్యవసాయ చట్టాలతో దేశ రైతులు స్వయం సమృద్ధి సాధిస్తారని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ భరోసా వ్యక్తం చేశారు. రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసిన పంటల సంఖ్య పెరిగిందని చెబుతూ  ఉదాహరణకు 2013-14లో ప్రభుత్వం పెసళ్లను కొనుగోలు చేయలేదని, అదే సమయంలో 2019-20లో 1.66 లక్షల మెట్రిక్‌ టన్నుల పంటను ప్రభుత్వం కొనుగోలు చేసిందని మంత్రి ట్వీట్‌ చేశారు. 
 
ఇటీవల పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో తీసుకువచ్చిన మూడు బిల్లులపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆదివారం తన ఆమోదాన్ని తెలిపారు. దీంతో మూడు బిల్లులు ఇప్పుడు చట్టంగా మారాయి. కేంద్రం తీసుకువచ్చిన మూడు బిల్లులు నిత్యావసర సరుకుల సవరణ బిల్లు-2020, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్, ఫెసిలియేషన్ బిల్లు- 2020, ఫార్మర్స్ ఎంపవర్ మెంట్ అండ్ ప్రొటక్షన్, అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ బిల్లు-2020) పార్లమెంటు ఆమోదం పొందడంతో రాజకీయ పార్టీలతో పాటు రైతుసంఘాలు భగ్గుమంటున్నాయి.
 
బిల్లులను వ్యతిరేకిస్తూ శిరోమణి అకాళీదల్‌ (ఎస్‌డీఏ) శనివారం నేషనల్‌ డెమోక్రటిక్‌ అలయన్స్‌ నుంచి వైదొలగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం మన్‌కీ బాత్‌లో బిల్లులపై రైతుల భయాలను పోగొట్టేందుకు ప్రయత్నం చేశారు. దేశీయ వ్యవసాయరంగం తనను తాను సంకెళ్లు లేకుండా చేసిందని, ఆత్మనిర్భర్‌ భారత్‌కు బలమైన పునాది రాయి వేయడానికి రైతులు, వ్యవసాయరంగం బలంగా ఉండాలని పేర్కొన్నారు. 
 
‘అతిపెద్ద తుఫాను సమయంలో కూడా గ్రౌండ్ చేయబడిన వ్యక్తి స్థిరంగా ఉంటాడు. మన వ్యవసాయ రంగం, మన రైతులు ఈ కష్టకాలంలో దీనికి సజీవ ఉదాహరణ. సంక్షోభ సమయంలో కూడా మన వ్యవసాయ రంగం తన పరాక్రమాన్ని మరోసారి చాటింది” అంటూ ప్రధాని కొనియాడారు. 
 
మన రైతులు, వ్యవసాయ రంగం, గ్రామాలు ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’కు పునాది. అవి బలంగా ఉంటే ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ పునాది బలంగా ఉంటుందని ప్రధాని స్పష్టం చేశారు. 
 
కాగా, నిజమైన రైతులెవరూ ట్రాక్టర్ లేదా వ్యవసాయానికి ఉపయోగించేవాటిని తగులబెట్టరని బీజేపీ ఎంపీ, యువమోర్చ జాతీయ అధ్యక్షుడు  తేజస్వి సూర్య స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ యువ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సోమవారం ట్రాక్టర్‌ను దహనం చేయడంపై ఆయన మండిపడ్డారు. 
 
యువ కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన ఈ పని హింసాత్మక చర్య అని, ఇది రైతులను అవమానించడమేనని తేజస్వి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు తమ సంక్షేమం కోసమేనని రైతులకు తెలుసని చెప్పారు. 
 
ఈ బిల్లులపై ఇప్పుడు నిరసనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గతంలో ఈ సంస్కరణలు తెస్తామని తమ మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే వ్యవసాయ సంస్కరణలను మోదీ ప్రభుత్వం అమలు చేయడంతోనే కాంగ్రెస్ పార్టీ యూటర్న్ తీసుకున్నదని తేజస్వి సూర్య దుయ్యబట్టారు.