పూరీ జగన్నాథ ఆలయంలో 404 మందికి కరోనా

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో సేవకులుగా పనిచేస్తున్న 351 మందికి కొవిడ్-19 పాజిటివ్ ఉన్నట్టు ఆరోగ్య పరీక్షల్లో తేలింది. వీరితో పాటు మరో 53 మంది సిబ్బంది కూడా వైరస్ బారిన పడినట్టు గుర్తించారు.

12వ శతాబ్దం నాటి ఈ ఆలయంలో పనిచేస్తున్న మొత్తం 404 మందికి కరోనా సోకినట్టు శ్రీ జగన్నాథ ఆలయ యాజమాన్యం (ఎస్‌జేటీఏ) నిర్వాహకుడు అజయ్ జెనా వెల్లడించారు. అయితే ఇంతమంది సేవకులు అందుబోటులో లేకపోయినప్పటికీ జగన్నాథ ఆలయంలో పూజా కార్యక్రమాలు యధాతథంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్-19 నేపథ్యంలో మార్చి నెల నుంచి జగన్నాథ ఆలయంలో భక్తుల దర్శనాలను నిలిపివేశారు. కాగా అనేక మంది సేవకులు కరోనా బారిన పడి హోం ఐసొలేషన్‌లో ఉన్న నేపథ్యంలో.. పూజాదికాలు నిర్వహించగల సేవకులకు తీవ్ర కొరత ఉందని ఆలయ యాజమాన్యం పేర్కొంది.

శ్రీ బలభద్ర, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథులకు పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు ఒక్కొక్కరికి 13 మందితో కూడిన పురోహిత బృందాల అవసరం ఉంటుంది.

దీంతో తరతరాలుగా జగన్నాథుడి రూపంలో పూజలందుకుంటున్న, అత్యంత పురాతనమైన ఈ శ్రీ మహావిష్ణు ఆలయంలో  రోజువారీ నిత్య పూజాధికాలకు మొత్తం 39 మంది పూజారులు సహా ఇతర సేవకులు తప్పనిసరి.

తెల్లవారుజామున మొదలై రాత్రి పొద్దుపోయేదాకా ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఒకదానికొకటి పరస్పరం అనుసంధానం కలిగి ఉండడం ఇక్కడ పత్యేకత. ఆలయ సంప్రదాయం ప్రకారం ఒక్కచోట పూజ జరక్కపోతే మరోచోట నిర్వహించే అవకాశం లేదని జగన్నాథ ఆలయ సంస్కృతిపై పరిశోధన చేస్తున్న భాస్కర్ మిశ్రా పేర్కొన్నారు.