కొత్త కార్మికచట్టాల అమలుకు రంగం సిద్ధం 

కేంద్రప్రభుత్వం మరికొద్ది రోజుల్లో అమలుచేయబోతున్న లేబర్‌ కోడ్స్‌తో (కొత్త కార్మికచట్టాలతో) దేశంలోని కార్మికలోకం తీవ్రంగా ప్రభావితం కాబోతున్నది. బ్రిటిష్‌ పాలన కాలం నుంచి క్రమానుగతంగా చేస్తూ వచ్చిన కార్మిక చట్టాలన్నింటినీ కలిపి మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్‌, ఇండస్ట్రియల్‌ కోడ్స్‌ తెచ్చింది. 
 
వేతనాల నుంచి సెలవుల వరకు, బోనస్‌ల నుంచి సమ్మెల వరకు అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. వీటి వల్ల దేశంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయని, కార్మికుల జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడుతాయని ప్రభుత్వం చెప్తున్నది. 
 
రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఉన్న కార్మికుల ప్రయోజనాలు అనే అంశంపై మొత్తంగా వివిధ రాష్ట్రాలు 100 వరకు చట్టాలు చేయగా, కేంద్ర చట్టాలు 40 వరకు ఉన్నాయి. 2002లో ఏర్పాటుచేసిన రెండో జాతీయ లేబర్‌ కమిషన్‌ ఈ చట్టాలన్నింటినీ సమీకృతపర్చి సరళమైన కొన్ని చట్టాలుగా మార్చాలని సూచించింది. 
 
ఆ సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం 29 చట్టాలను కలిపి 2019లో నాలుగు లేబర్‌ కోడ్లుగా (కార్మిక నియమావళులుగా) తీసుకొచ్చింది. వీటిలో ఒకటైన వేతనాల నియంత్రణ కోడ్‌ను పార్లమెంటు 2019లో ఆమోదించింది. 
 
మిగిలిన మూడు.. పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2020, సామాజిక భద్రత కోడ్‌-2020, పనిప్రదేశాలు, ఆరోగ్యం, వృత్తి భద్రత కోడ్‌-2020 బిల్లులను సమీక్ష కోసం పార్లమెంటరీ స్థాయీసంఘానికి సమర్పించారు. ఆ సంఘం చేసిన సిఫార్సులతో మార్పులు చేర్పులు చేసి తిరిగి మూడు కోడ్‌ బిల్లులను కేంద్రం తీసుకొచ్చింది. 
 
వీటికి ఇటీవల పార్లమెంటు సమావేశాల చివరిరోజున ప్రతిపక్షాలు లేకుండానే ఆమోదం లభించింది (ఎంపీల బహిష్కరణను నిరసిస్తూ మెజారిటీ ప్రతిపక్షాలు పార్లమెంటు సమావేశాల్ని బహిష్కరించాయి). ఈ నాలుగు బిల్లులు ఈ నెలాఖరులో చట్టాలుగా అమల్లోకి రానున్నాయి.
వేతన కోడ్‌ ద్వారా కనీస వేతన నిర్ణయ విధానంలో మార్పులు చేశారు. ప్రాంతం, కుటుంబ అవసరాలను బట్టి ప్రభుత్వ సూచనల మేరకు కనీస వేతనాన్ని నిర్ణయిస్తారు. కనీస వేతన నిర్ణయంలో కంపెనీల అభిప్రాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. దేశాన్ని  మెట్రోపాలిటన్‌ ప్రాంతం, నాన్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతం, గ్రామీణ ప్రాంతం అని మూడు విధాలుగా విభజించారు. వేర్వేరు ప్రాంతాల్లో కనీస వేతనం వేర్వేరుగా ఉండనుంది.
ఒక రోజులో కార్మికుడు చేయాల్సిన పని గంటల విషయంలో ఈ చట్టంలో స్పష్టత లేదు. సెక్షన్‌ 13 (1) (ఏ) ప్రకారం కార్మికుడు రోజుకు గరిష్ఠంగా 8 గంటలు పనిచేయాలి. పని సమయంలో ఒక గంట దాటకుండా ఒకసారిగానీ అంతకుమించిగానీ విశ్రాంతి తీసుకోవచ్చు.
ఈ 8 గంటల షిఫ్ట్‌ 12 గంటల వ్యవధిలో ఉండాలి. కానీ కొన్ని రాష్ట్రాలు ఏప్రిల్‌లోనే రోజుకు 12 గంటల పనిదినాన్ని అమలుచేయటం ప్రారంభించాయి. ప్రతి కార్మికుడు వారంలో ఒకరోజు విశ్రాంతి (సెలవు) తీసుకోచ్చు. సెలవురోజు ఆదివారం ఉండాలా మరే రోజైనా ఇవ్వాలా అనేది యజమాని నిర్ణయిస్తాడు. 
పారిశ్రామిక సంబంధాల కోడ్‌-2020 ప్రకారం.. 300 మంది వరకు సిబ్బంది/కార్మికులు ఉన్న కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపునకు, కంపెనీ మూసివేతకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు.
ఇదివరకు 100 మంది వరకు సిబ్బంది కలిగిన కంపెనీలకే ఈ వెసులుబాటు ఉండేది. ఇప్పుడు దీనిని 300కు పెంచారు. 300 కంటే ఎక్కువ మంది కార్మికులు ఉన్న సంస్థలు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ అధికారులు కంపెనీ విజ్ఞప్తికి స్పందించని పక్షంలో, మూసివేత ప్రతిపాదనకు ఆమోదం లభించినట్లుగానే పరిగణిస్తారు.
ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధి కోసం ఏ నూతన ఫ్యాక్టరీకైనా కోడ్‌ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పించారు. అన్ని పరిశ్రమల్లో అన్ని రకాల పనుల్లో మహిళలను నియమించేందుకు అనుమతి కల్పించారు. 
కార్మికుల సమ్మెకు సంబంధించి పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో కొత్త నిబంధనలు పొందుపరిచారు. సమ్మె చేయాలంటే యూనియన్లు 60 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. లేబర్‌ ట్రిబ్యునల్‌ లేదా నేషనల్‌ ఇండస్ట్రియల్‌ ట్రిబ్యునళ్లలో ప్రొసీడింగ్స్‌ పెండింగ్‌లో ఉంటే, అవి ముగిసిన 60 రోజుల వరకు కార్మికులు సమ్మెకు దిగరాదు. సంఘటిత కార్మికులతోపాటు అసంఘటిత కార్మికులకు కూడా సామాజిక భద్రత కల్పించనున్నట్లు సామాజిక భద్రత కోడ్‌ బిల్లులో హామీ ఇచ్చారు.