మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కరోనా

ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‍కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాల కోసం వారం రోజులపాటు అక్కడే ఉన్న మంత్రి కరోనా టెస్టులు జరిపించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. 
 
తిరుమల బ్రహ్మోత్సవాల్లో పట్టువస్త్రాలు సమర్పించేందుకు వచ్చిన సీఎం జగన్ కు పక్కనే ఉండి అన్ని కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లి జరిపించారు. వివాదాల నేపధ్యంలో  బ్రహ్మోత్సవాల సందర్భంగా వారం పాటు తిరుమలలోనే మకాం వేశారు.
 
 బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు తిరుమలలోనే ఉన్నమంత్రి  ఈ నెల 25వ తేదీన విజయవాడ చేరుకున్నారు. వారం పాటు బయట ఉండి రావడంతో ముందు జాగ్రత్తగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు జరిపించుకోగా  స్వల్పంగా కోవిడ్ లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో మంత్రి వెల్లంపల్లి  ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకుంటున్నారు.
 
మరోవంక, ఏపీలో కరోనా ఉధృతి క్రమంగా తగ్గుతోంది. ఆదివారం 76,416 మందికి పరీక్షలు నిర్వహించగా 6,923 మందికి వైరస్‌ నిర్థారణ అయింది. 45 మంది చనిపోయారు. గత రెండు వారాలుగా రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి క్రమంగా తగ్గుతోంది. పట్టణ ప్రాంతాల్లో కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తోంది. దీంతో జిల్లాల వారీగా కలెక్టర్లు ఎక్కడికక్కడ కంటైన్‌మెంట్‌జోన్లు ప్రకటిస్తున్నారు. 
 
ఇప్పటి వరకూ రాష్ట్రంలో 56,00,202 పరీక్షలు నిర్వహించారు. ఆదివారం ఒక్కరోజే 7,796 మంది కరోనా నుండి కోలుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువ జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గుతున్నా పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లో తగ్గుదల కనిపించడం లేదు. ప్రతి రోజూ రెండు జిల్లాల్లో కలిపి రెండు వేలకు తక్కువగాకుండా కేసులు నమోదవుతున్నాయి. 
 
తొలుత ఉగ్రరూపం చూపిన కృష్ణా, గుంటూరు, కర్నూలు, అనంతరం వేగంగా పెరిగిన అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. రాష్ట్రంలో ఆదివారం పాజిటివిటీ రేటు 12.07కు, మరణాల రేటు 0.84 శాతానికి తగ్గింది. రివకరీ రేటు మాత్రం 89.55 శాతానికి పెరిగింది. 
 
దేశంలో ఛండీఘడ్‌ 91.98 శాతంతోనూ, తమిళనాడు 90.34 శాతంతోనూ మొదటి రెండోస్థానాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6,75,674 మందికి కరోనా సోకగా 605090 మంది రికవరీ అయ్యారు. 64,874 మంది వేర్వేరు చోట్ల చికిత్స పొందుతున్నారు. 5, 708 మంది మృతిచెందారు.