ఐసిస్ ఉగ్ర‌వాది సుభానీ హ‌జాకు జీవిత ఖైదు

ఐసిస్ ఉగ్ర‌వాది సుభానీ హ‌జా మొయిద్దీన్‌కు జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ‌(ఎన్ఐఏ) కోర్టు జీవిత ఖైదు విధించింది. రూ. ల‌క్ష కూడా జ‌రిమానా విధించింది. మొయిద్దీన్‌కు జీవిత ఖైదు విధిస్తూ ఎన్ఐఏ కోర్టు ప్ర‌త్యేక జ‌డ్జి పి కృష్ణ కుమార్ తీర్పు ఇచ్చారు.
నిషేధించ‌బ‌డ్డ ఐసిస్ ఉగ్ర‌వాద సంస్థ‌లో కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌డం, యువ‌కుల‌ను ఉగ్ర‌వాదం వైపు మ‌ళ్లించ‌డం, ఆసియా కూట‌మి దేశ‌మైన ఇరాక్‌పై దాడులు చేసిన కేసుల్లో సుభానీ దోషిగా నిర్ధారించబ‌డిన‌ట్లు శుక్ర‌వారం కోర్టు తెలిపింది.
దీంతో ఇవాళ ఆ ఉగ్ర‌వాదికి శిక్ష ఖ‌రారు చేసింది కోర్టు. ఏ దేశానికి వ్య‌తిరేకంగా తాను ఉగ్ర‌వాద కార్య‌క‌లాపాలు చేప‌ట్ట‌లేద‌ని కోర్టుకు సుభానీ తెలిపాడు. శాంతియుతంగానే పోరాటం చేశాన‌ని, హింస ద్వారా శాంతి రావ‌డం క‌ష్ట‌మ‌ని చెప్పాడు.
కేర‌ళ‌కు చెందిన సుభానీ హజా మొయిద్దీన్‌ను త‌మిళ‌నాడులో ఎన్‌ఐఏ అధికారులు 2016లో అరెస్టు చేశారు. ఇతను సిరియాలో ఐసిస్‌తో కలిసి ఏడాది పాటు పనిచేసి భారత్‌కు వచ్చాడు. ఇరాక్‌లోని మోసుల్ ప్రాంతానికి వెళ్లిన మొయినుద్దీన్ అక్క‌డ ఉగ్ర‌వాదుల‌తో క‌లిసి ప‌నిచేశాడు.