నేటి నుంచి ‘కౌన్ బనేగా క్రోరోపతి’ 12 వ సీజన్  

ప్రముఖ రియాలిటీ షో ‘కౌన్ బనేగా క్రోరోపతి’ 12 వ సీజన్ ఇవ్వాల్టి నుంచి ప్రారంభం కానున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తి  నేపథ్యంలో ప్రజలంతా ఎంతగానో ఎదురుచూస్తున్న కేబీసీ.. నేటి రాత్రి 9 గంటల నుంచి వీక్షకులను అలరించనున్నది. ప్రతిసారి మాదిరిగానే ఈసారి కూడా అమితాబ్ బచ్చన్ ప్రయోక్తగా వ్యవహరిస్తున్నారు. 
 
కరోనా కారణంగా కేబీసీలో కొన్ని మార్పులు చేశారు. ఫాస్టెస్ట్‌ ఫింగర్‌ పరీక్షా రౌండ్‌కు హాజరయ్యే వారిని  హోటల్‌లో నిర్బంధిస్తారు. అదే సమయంలో భౌతిక దూరం యొక్క నిబంధనలను అనుసరించడానికి ఈ రౌండ్లో పాల్గొనే వారి సంఖ్యను కూడా ఎనిమిదికి తగ్గించారు. 
 
కేబీసీ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో చూసేందుకు కూడా అవకాశం ఉన్నది. సోనిలివ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని  వీక్షించవచ్చు లేదా సోనిలివ్.కాంకు లాగిన్ అయి ప్రదర్శనను ప్రత్యక్షంగా చూడొచ్చు. జియో కస్టమర్ అయితే మీ మొబైల్‌లో కేబీసీ రియల్ టైమ్ చూడటానికి జియో టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 
 
ఎయిర్‌టెల్ కనెక్షన్ కలిగివున్నవారు ఎయిర్‌టెల్ టీవీ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకుని చూడొచ్చు. ఈసారి సోనీలైవ్ కేబీసీ ప్లే అలోంగ్ విభాగాన్ని ప్రారంభించారు. ఈ విభాగం కింద ప్రేక్షకులు ప్రతిరోజూ రూ 10 లక్షలు గెలుచుకునే అవకాశం కల్పిస్తున్నారు. కేబీసీ ప్లే అలోంగ్‌లో దేశవ్యాప్తంగా పది మంది విజేతలను ఎంపిక చేసి మొత్తం సీజన్‌కు ప్రతిరోజూ రూ.లక్ష అందజేస్తారు. 
 
ప్రేక్షకులు జట్లుగా ఆడటంగానీ, స్నేహితులు కలిసిగానీ, కుటుంబ సభ్యులతో కలిసిగానీ జట్టును ఏర్పాటు చేసుకోవచ్చు. జట్టు స్కోరు వ్యక్తిగత ఆటగాళ్ల స్కోర్‌ల మొత్తం అవుతుంది. టాప్ స్కోరింగ్ జట్టు ప్రతి రోజు రూ.లక్ష బహుమతి గెలుచుకుంటుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రదర్శనకు ప్రత్యక్ష ప్రేక్షకులు ఉండరు. 
 
అలాగే, మాస్క్‌, శానిటైజర్, నిర్ణీత దూరం నియమాలు పూర్తిగా అనుసరిస్తున్నారు. నిర్మాణ బృందంలోని వ్యక్తులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఒకరితో ఒకరు కలువకుండా చూసుకుంటున్నారు. ప్రేక్షకుల పోల్‌ లైఫ్ లైన్‌ను మార్చారు. దీనికి బదులుగా ‘వీడియో ఎ ఫ్రెండ్’ గా అందుబాటులోకి తెచ్చారు.
 
కరోనా మహమ్మారి కారణంగా కౌన్ బనేగా కరోడ్‌పతి సీజన్‌ 12 నమోదుప్రోమోల కోసం అమితాబ్ బచ్చన్ ఇంటి నుంచే ప్రోమో షూట్‌ చేశారు. అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్‌కు గురై దవాఖానలో చేరడంతో కేబీసీ ప్రారంభం కొంత ఆలస్యమైంది. 
 
కరోనా నుంచి కోలుకున్న వెంటనే తిరిగి కేబీసీ సెట్లోకి  వచ్చి ఎంపిక కార్యక్రమాలు చేపట్టారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా పోటీదారుల ఎంపిక, నమోదునుంచి ఆడిషన్ల వరకు ప్రతీది పూర్తిగా వర్చువల్‌గా ఆన్‌లైన్‌లో చేపట్టారు.