విద్యార్దునులకు నితీష్ నగదు ప్రోత్సాహకాలు

బీహార్‌లో ఎన్నికల నగారా మోగిందో లేదో.. పార్టీల వరాల జల్లులతో అక్కడి ప్రజలు తడిసి ముద్దవుతున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ‘జనతా దళ్‌ (యునైటెడ్‌) – (జెడియు)’ నేత నితీష్‌కుమార్‌ తన మేనిఫెస్టోను విడుదల చేశారు. 
 
గత ఎన్నికల్లో విజయవంతమైన ‘సాత్‌ నిశ్చరు ‘ పార్ట్‌ 2ను మీడియా సమావేశంలో ఆవిష్కరించారు. 7 పాయింట్ల ఎజెండాకు సీక్వెల్‌గా అభివర్ణించారు. తిరిగి తాను ఎన్నికల్లో విజయం సాధిస్తే.. హయ్యర్‌ సెకండరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు రూ. 25 వేలు, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన వారికి రూ. 50వేలు ఇస్తామని ప్రకటించారు. 
 
వ్యవసాయ భూములన్నింటికీ సాగునీటిని అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం సాధ్యం కాదని అంగీకరించారు. ప్రతిజిల్లాలో నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుచేస్తామని, వీటిని నిర్వహించేందుకు కొత్త విభాగాన్ని కూడా రూపొందిస్తామని తెలిపారు. 
 
అన్ని గ్రామాల్లోనూ వీధి దీపాలను ఏర్పాటు చేస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాల నిర్వహణ చేపడతామని హామీ ఇచ్చారు. అన్ని నగరాలు, పట్టణాలలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని, వృద్ధులకు వసతి గృహాలు, పేదలకు ఇళ్లు కల్పిస్తామని ప్రకటించారు. 
 
గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య వసతులతో పాటు శ్మశాన వాటికలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఫ్లైఓవర్లు, బైపాస్‌ రోడ్లు నిర్మిస్తామని అన్నారు.