కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తప్పించాలి

ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగిలపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్సీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివిఎన్  మాధవ్ తీవ్రంగా ఖండించారు. ‘మోదీ, యోగి ఆదిత్యలపై మదం ఎక్కి మాట్లాడుతున్నారు. మంత్రిని కదా అని నోటికొచ్చినట్లుగా మాట్లాడితే సహించేది లేదు’ అని హెచ్చరించారు. నానిని మంత్రి పదవి నుండి తప్పించేవరకు తాము పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. 
 
ఆంజనేయ స్వామి విగ్రహం, రథం దగ్ధం, అమ్మవారి వెండి సింహాలపై చేసిన వ్యాఖ్యలతో ప్రజలు తిడుతున్నారని చెబుతూ ప్రధాని మోదీ, యోగి ఆదిత్యల జీవితాల గురించి కొడాలి నానికి ఏం తెలుసని ప్రశ్నించారు. 
 
`నిన్నటి వరకు మంత్రిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాం. ఈరోజు చేసిన వ్యాఖ్యలతో కొడాలి నానిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నానిని తొలగించాలంటూ ఆందోళనలు చేపడతాం’ అని స్పష్టం చేశారు. 
 
మోదీ, యోగి ఆదిత్య ‌జీవన శైలి తెలుసు కోవాలి. వారి సతీమణి గురించి మాట్లాడటానికి మంత్రికి సిగ్గుండాలి. తిరుమలలో ఉన్న నాని… అక్కడ ఉన్న వెంకన్న రాయా, బొమ్మా, దేవుడా చెప్పాలి. ప్రభుత్వం కూడా స్పందించి నానిపై చర్యలు తీసుకోవాలని మాధవ్ హితవు చెప్పారు. 
 
అక్రమంగా అరెస్ట్ చేసిన హిందూ‌వాదులపై కేసులు కూడా ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం లేదంటే ఆయనపై కూడా అనుమానాలు కలుగుతున్నాయని మాధవ్ చెప్పారు. దేవాదాయ శాఖ మంత్రి కనీసం ఖండించక పోగా, . అవహేళనతో మాట్లాడుతున్నారని మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
కాగా, ప్రధాని మోదీ, సీఎం యోగి ఆచరణ, నిబద్ధత తెలిసి కూడా కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుతప్పుబట్టారు. కొడాలి నానిని మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. వైసీపీ, టీడీపీ ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రజలు బుద్ది చెబుతారని జీవీఎల్ హెచ్చరించారు.