2.63 లక్షల ఇళ్ళు  ఏమయ్యాయి కేసీఆర్!

టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 2. 63 లక్షల  రెండు పడకల గదులను నిర్మిస్తామని  స్వయంగా కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి ఆరేళ్లైనా 40,000కు మించి నిర్మించలేదని బిజెపి మాజీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె లక్ష్మణ్ ధ్వజమెత్తారు. 
 
హైదరాబాద్ నగరంలో పేదలను మభ్యపెట్టి జిహెచ్ఎంసి, శాసనసభ  తదితర ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎన్నికలలో ఓట్లు దండుకుని ఏరు దాటే దాకా ఓడ మల్లన్న ఏరు దాటాక బోడి మల్లన్న అనే చందంగా టిఆర్ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. .
 
 నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ గ్రేటర్ పరిధిలో లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పడం హాస్యాస్పదమని విమర్శించారు. నియోజకవర్గానికి 4000 అని చెప్పి ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో తీరా చూస్తే 631 కట్టామని, అందులో 430 మందికి కేటాయించామని తేల్చారని గుర్తు చేశారు. 
 
లక్ష ఇళ్లు నిర్మిస్తామని చెప్పి 631 మాత్రమే కట్టడం బట్టి చూస్తే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అర్థమవుతుందని ఎద్దేవా చేశారు.  కేంద్ర ప్రభుత్వం అందరికీ ఆవాసం (ఇల్లు) ప్రతి అర్హులైన పేదవారికి సొంతింటి కలను నిజం చేయాలని చిత్తశుద్ధితో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రవేశపెడితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదని దుయ్యబట్టారు.
కేంద్ర ప్రభుత్వం రూ 6 లక్షలను వివిధ బ్యాంకుల ద్వారా, హడ్కో ద్వారా అప్పు ఇవ్వగా, రూ 2.5 లక్షల మాఫీ, మిగతా రూ 3.5 వడ్డీ లో ఆరున్నర శాతం కేంద్రమే భరిస్తుందని లక్ష్మణ్ గుర్తు చేశారు. హైదరాబాద్ నగరంలో లక్షమంది నమోదు చేసుకుంటే ఒక్క దరఖాస్తు కూడా పరిగణలోకి తీసుకోలేదు దరఖాస్తులు అన్నిటిని తొక్కి పెట్టారని విస్మయం వ్యక్తం చేశారు.
 
ముషీరాబాద్ నియోజకవర్గంలో తాను శాసనసభ్యునిగా ఉన్నప్పుడు 12 బస్తీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపిస్తే ఆరు బస్తీలు మంజూరు చేసి నాలుగు సంవత్సరాలు కావస్తున్నా నిర్మాణం జరగలేదని తెలిపారు.  నేడు వారందరూ రాష్ట్ర ప్రభుత్వ మోసాన్ని గ్రహించారని చెప్పారు.
మళ్లీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి  మళ్లీ మోసం చేసే ప్రయత్నం టిఆర్ఎస్ పార్టీ చేస్తున్నదని లక్ష్మణ్ ప్రజలను హెచ్చరించారు. పేద ప్రజల పక్షాన నిలబడి బిజెపి అలుపెరగని పోరాటం చేస్తోంది.
అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద లబ్ధిదారులను గుర్తించి వారికి ఇండ్లు వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. రెండు పడక గదుల ఇళ్లను పేద ప్రజలకు గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అందరికీ ఇండ్లు ఇచ్చి న తర్వాతనే రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఓటు అడగాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.