విపక్షాలపై రాజ్‌నాథ్, నితీష్ మండిపాటు 

రాజ్య‌స‌భ‌లో విప‌క్ష స‌భ్యుల నిర‌స‌నను ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఖండించారు. వ్యవ‌సాయ బిల్లుల‌ను ఆదివారం స‌భ‌లో ఆమోదింప చేసే స‌మ‌యంలో విప‌క్ష స‌భ్యులు ఆందోళ‌న చేప‌ట్టిన ఘ‌ట‌న‌ను ఖండిస్తూ తాను కూడా రైతునే అని,  రైతుల‌ను ప్ర‌భుత్వం న‌ష్ట‌ప‌రుస్తుంద‌ని ఎప్పుడూ న‌మ్మ‌వ‌ద్దు అని రాజ్‌నాథ్ తెలిపారు. 
 
పార్ల‌మెంట్‌లో విప‌క్ష స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న ప్రజాస్వామ్యానికే సిగ్గు చేటని ఆయన మండిపడ్డాయిరు.  విప‌క్షాలు రైతుల‌ను త‌మ నిర‌స‌న‌తో గంద‌ర‌గోళంలో నెట్టివేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.  ఒక‌వేళ విప‌క్ష స‌భ్యులు చెప్పిందే క‌రెక్ట్ అని అనుకుంటే,  అలా హింసాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించ‌డం స‌మంజ‌స‌మేనా అని ప్రశ్నించారు. 
 
చైర్‌పైకి ఎక్కి మైక్‌ల‌ను ప‌గుల‌గొడుతారా అని రాజ్‌నాథ్ నిలదీశారు.  డిప్యూటీ చైర్మ‌న్ ప‌ట్ల స‌భ్యులు ప్ర‌వ‌ర్తించిన తీరు దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని పేర్కొన్నారు. చైర్ వైపు వెళ్లి రూల్‌బుక్‌ను చింపివేయ‌డం రాజ్య‌స‌భ చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదని దుయ్యబట్టారు. 
కాగా, రాజ్య‌స‌భ‌లో డిప్యూటీ చైర్మ‌న్ హ‌రివంశ్ ప‌ట్ల స‌భ్యులు ప్ర‌వ‌ర్తించిన తీరును బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఖండించారు. రాజ్య‌స‌భ ప‌రంప‌ర‌కు, మ‌ర్యాద‌కు విరుద్ధంగా ఎంపీలు ప్ర‌వ‌ర్తించిన‌ట్లు నితీశ్‌ ఆరోపించారు.  
 
త‌న ట్విట్ట‌ర్ ద్వారా సీఎం నితీశ్ ఈ ఘ‌ట‌నపై స్పందిస్తూ రాజ్య‌స‌భలో జ‌రిగిన వివాదం ప‌ట్ల దుఖ్కాన్ని వ్య‌క్తం చేస్తున్న‌ట్లు తెలిపారు. రాజ్య‌స‌భ హుందాత‌నానికి ఈ ఘ‌ట‌న మ‌చ్చ‌గా మిగులుతుంద‌ని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో స‌భ మ‌ర్యాద‌ను స‌భ్యులే కాపాడాల‌ని హితవు చెప్పారు.