చైనా యాప్‌ల‌పై అమెరికా నిషేధం  

చైనా యాప్‌లపై అగ్రరాజ్యం అమెరికా నిషేధం విధించింది.  జాతీయ భద్రతకు ప్రమాదకరమని పేర్కొంటూ.. షార్ట్ వీడియో షేరింగ్ యాప్‌ టిక్‌టాక్‌తో పాటు వీచాట్‌ను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది.  ఆదివారం నుంచి రెండు యాప్‌ల డౌన్‌లోడ్‌లను నిలిపివేయనున్నట్లు అమెరికా అధికారులు శుక్రవారం తెలిపారు.

ఆదివారం అర్ధరాత్రి నుంచి యూఎస్‌లోని యాప్‌ స్టోర్ల నుంచి పాపులర్‌ యాప్‌లు టిక్‌టాక్‌, వీచాట్‌లను అమెరికన్లు డౌన్‌లోడ్‌ చేయలేరు. చైనా కమ్యూనిస్టు ప్రభుత్వ నియంత్రణలో ఉన్న కంపెనీలు చైనా ప్రభుత్వానికి అమెరికా పౌరుల వ్యక్తిగత, నెట్‌వర్క్‌ యాక్టివిటీ, లోకేషన్‌ డేటా, బ్రౌజింగ్‌, సెర్చ్‌ హిస్టరీ తదితర సమాచారాన్ని   చేరవేస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో పాటు పలువురు అమెరికా చట్టసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సెప్టెంబర్‌  మధ్య నుంచి టిక్‌టాక్ యాజమాన్యం బైట్‌డాన్స్‌తో  లావాదేవీలను నిషేధిస్తూ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులు కూడా ఇచ్చారు టిక్‌టాక్‌కు అమెరికాలో 8 కోట్ల మంది యాక్టివ్ యూజర్స్ ఉండగా  ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. అమెరికాలో టిక్‌టాక్ కార్యకలాపాలను తమ దేశంలోని కంపెనీలకే  విక్రయించాలని ట్రంప్  షరతు విధించారు.

ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేనిపక్షంలో దాన్ని నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే హెచ్చరించారు. దీంతో ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు తొలుత మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా చర్చలు ఫలించలేదు.

దీంతో ఒరాకిల్‌ రంగంలోకి దిగింది. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరిపింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించేందుకు తాను సిద్దంగా లేనని ట్రంప్ గురవారం వెల్లడించారు