వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాల వలలో పడకండి!

వ్యవసాయ రంగానికి సంబంధించి కేంద్రం తీసుకొచ్చిన మూడు కొత్త ఈ బిల్లులకు నిరసనగా కేంద్ర మంత్రి, అకాళీదల్ నేత హర్‌‌సిమ్రన్ కౌర్ గురువారం రాజీనామా చేశారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ ఈ బిల్లులపై ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పార్టీలు.. ఇప్పుడు వీటిని మేం అమలు చేయడంతో వ్యతిరేకిస్తున్నాయని మోడీ మండిపడ్డారు.

ప్రతిపక్షాలు రైతులకు కాకుండా మధ్యవర్తులకు సాయం చేయాలనుకుంటున్నాయని, రైతులు వారి అబద్ధాల వలలో పడొద్దని ఆయన హెచ్చరించారు. లోక్‌సభలో శుక్రవారం వ్యవసాయ బిల్లులు ఆమోదాన్ని ప్రధానమంత్రి స్వాగతించారు.

దళారీల నుంచి రైతులను కాపాడే ఈ సంస్కరణలను విపక్షాలు వ్యతిరేకించడాన్ని ఆయన తప్పుపట్టారు. దళారీలతో పనిలేకుండా రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు ఈ సంస్కరణలు వెసులుబాటు కల్పిస్తాయని చెప్పారు.

‘దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారితో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. వాళ్లు తమ మోసపూరిత మాటలతో రైతులను వలలో వేసుకోవాలని చూస్తున్నారు. రైతుల సంకెళ్లను తీసివేసే దిశగా ఇదో చారిత్రాత్మక అడుగు. రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేలా స్వేచ్ఛ కల్పించాలి. ప్రస్తుతం దేశానికి కావాల్సింది కూడా ఇదే’ అని స్పష్టం చేశారు. 

ప్రజలకు ఇచ్చిన హామీని ఎన్డీయే నిలబెట్టుకుంటుందని చెప్పారు. అయితే రైతుల నుంచి ధాన్యం, బియ్యంతోపాటు మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులను కనీస మద్దతు ధరకు  ప్రభుత్వం కొనుగోలు చేయబోదని కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని విమర్శించారు. 

ఈ సవరణ బిల్లుతో రైతులకు మినహాయింపు లభిస్తుందని, మధ్యవర్తులు, దళారుల పీడ విరగడ అవుతుందని పేర్కొన్నారు. ఇలా రైతులకు మేలు జరగడం, కొత్త కొత్త అవకాశాలు రావడం కొంత మందికి నచ్చడం లేదని విపక్షాలపై పరోక్షంగా మండిపడ్డారు. 

కనీస మద్దతు ధర గురించి కొందరు పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారని, పెద్ద పెద్ద హామీలిస్తారని, అయితే ఆ వాగ్దానాలను ఎప్పుడూ నెరవేర్చలేదని కాంగ్రెస్ పై ధ్వజమెత్తారు.  

కొత్తగా తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులు రైతులకు రక్షణ కవచాలని ప్రధాని స్పష్టం చేశారు. వ్యవసాయంలో రైతులకు కొత్త స్వాతంత్య్రం లభించినట్లే అని మోదీ  చెప్పారు. లోక్‌సభలో ఆమోదం పొందిన వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు చేకూరుతుందని స్పష్టం చేశారు.