కేంద్రమంత్రి గడ్కరీకి కరోనా

కేంద్ర రోడ్డురవాణా,రహదారులు,ఎంఎస్‌ఎంఇ మంత్రి నితిన్‌ గడ్కరీకి కరోనా సోకింది.  ఈ విషయాన్ని బుధవారం సాయంత్రం ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. ‘ నిన్న ఒంట్లో నలతగా అనిపించి, డాక్టర్‌ను సంప్రదించాను. పరీక్షలు నిర్వహించగా..కోవిడ్‌-19 అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. స్వీయ నిర్బంధంలో ఉన్నా’ అని ట్వీట్‌ చేశారు. 
 
ఇటీవల కాలంలో తనను కలిసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, ప్రోటోకాల్‌ అనుసరించాలని, సురక్షితంగా ఉండండి అటూ మరో ట్వీట్‌ చేశారు. ఇప్పటికే ఏడుగురు కేంద్ర మంత్రులు కరోనాబారిన పడ్డారు. 
 
హోం శాఖ మంత్రి అమిత్‌షా, జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, ఆయుష్‌ శాఖ మంత్రి సిర్పద్‌ నాయక్‌, వ్యవసాయ‌ శాఖ సహాయక మంత్రి కైలాష్‌ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కరోనా బారిన పడిన జాబితాలో ఉన్నారు.
 
పార్లమెంటు సమావేశాలకు ముందు సభ్యులకు నిర్వహించిన తప్పనిసరి కోవిడ-19 పరీక్షల్లో17మంది, లోక్‌సభ సభ్యులు, రాజ్యసభకు చెందిన ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చింది. ఈ సందర్భంగా గడ్కరీకి  కూడా నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన సోమవారం పార్లమెంటుకు హాజరైనట్టు తెలుస్తోంది. 
 
పార్లమెంటులో 25మంది సభ్యులు (ఎంపీలు), పార్లమెంటులో పనిచేస్తున్న 40మందికి  పాజిటివ్ వచ్చిందని మింట్ తెలిపింది. పార్లమెంటు సభ్యులైన మీనాక్షి లేకి, హనుమాన్ బెనివాల్, సుకాంత మజుందార్ తదితరులకు కరోనా నిర్దారణ అయింది. 
 
మరోవైపు గడ్కరీ ప్రస్తుతం నాగ్‌పూర్‌లో ఉన్నారని, స్వల్పంగా జ్వరం ఉందని ఆయన కార్యాలయం తెలిపింది. తాజా పరిణామంతో ప్రస్తుత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు గడ్కరీ దూరం కానున్నారు.