సైనికుల పెట్రోలింగ్‌ను అడ్డుకునే శ‌క్తి ఏదీలేదు

స‌రిహ‌ద్దుల్లో భార‌త సైనికుల పెట్రోలింగ్‌ను అడ్డుకునే శ‌క్తి ఎవ‌రికీ లేద‌ని  ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనాతో స‌రిహ‌ద్దు వివాదంపై ఇవాళ రాజ్య‌స‌భ‌లో ఓ ప్రకటన చేస్తూ తూర్పు ల‌డాఖ్‌లో వివాదాస్ప‌ద స‌రిహ‌ద్దు వ‌ద్ద భార‌తీయ ఆర్మీ పెట్రోలింగ్ ద‌ళాల‌ను చైనా బ‌ల‌గాలు అడ్డుకుంటాయ‌ని ఓ స‌భ్యుడు వేసిన ప్ర‌శ్న‌కు మంత్రి స‌మాధానం ఇచ్చారు. 
 
పెట్రోలింగ్ చాలా సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో జ‌రుగుతుంద‌ని, నిర్దేశిత విధానాల ప్ర‌కార‌మే ఉంటుంద‌ని, మ‌న సైనికుల‌ను పెట్రోలింగ్ నుంచి అడ్డుకునే శ‌క్తి ఎవరికీ లేద‌ని, ఆ పెట్రోలింగ్ విష‌యంలోనే మన సైనికులు ప్రాణ‌త్యాగం చేసిన‌ట్లు మంత్రి స్ప‌ష్టం చేశారు. పెట్రోలింగ్ విధానంలో ఎటువంటి మార్పు ఉండ‌ద‌ని తేల్చి చెప్పారు. 
 
పెట్రోలింగ్‌కు అభ్యంత‌రం చెప్ప‌డం వ‌ల్లే చైనా ద‌ళాతో భార‌తీయ సైనికుల ఘ‌ర్ష‌ణ మొద‌లైన‌ట్లు మాజీ ర‌క్ష‌ణ మంత్రి ఏకే ఆంటోనీ ప్ర‌శ్నించారు. దీనిపై రాజ్‌నాథ్ స్పందిస్తూ ఈ సంద‌ర్భంలో మ‌రింత సున్నిత‌మైన అంశాల‌ను వెల్ల‌డించ‌లేమ‌ని తెలిపారు.  జూన్ 15వ తేదీన గాల్వ‌న్ లోయ‌లో జ‌రిగిన ఘ‌ర్ష‌ణ‌లో 20 మంది భార‌తీయ సైనికులు మృతిచెందిన విష‌యం తెలిసిందే.  ఆ త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితులు కొన‌సాగుతూనే ఉన్నాయి.  
 
వాస్తవాధీన రేఖ వ‌ద్ద చైనా ద‌ళాలు ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణాన్ని సృష్టిస్తున్న‌ట్లు తెలిపారు. స‌రిహ‌ద్దు ఒప్పందాల‌ను ఉల్లంఘించ‌డం మంచిది కాద‌ని చైనాకు హితవు చెప్పారు. స‌రిహ‌ద్దుల్లో శాంతియుత ప‌రిస్థితులు ఉండాల‌ని భార‌త్ కోరుకుంటున్న‌ద‌ని, అయితే చైనామాత్రం స‌రిహ‌ద్దుల్లో భార‌త్‌ను క‌వ్విస్తున్న‌ద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. 
 
చైనా బ‌ల‌గాల‌ను భార‌త్ సైన్యం స‌మ‌ర్థంగా అడ్డుకుంటున్నాయ‌ని చెప్పారు. చైనా బ‌ల‌గాల క‌ద‌లిక‌ల‌పై నిఘా తీవ్ర‌త‌రం చేశామ‌ని తెలిపారు. ప్ర‌ధాని మోదీ ల‌ఢ‌క్ వెళ్లి సైనికుల‌కు భ‌రోసా ఇచ్చార‌న్నారు. భారత్ భూభాగమైన లడఖ్ లో చైనా అక్రమ చొరబాట్లకు పాల్పడుతుందని చెబుతూ ఇప్పటి వరకు లడఖ్ లో సుమారు 38వేల స్వైర్ కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకుందని మండిపడ్డారు.
 
ఈ అంశంపై విప‌క్ష స‌భ్యులు కూడా త‌మ గ‌ళం వినిపించారు.  ఆర్మీ వెంటే దేశం ఉంటుంద‌ని కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శ‌ర్మ చెబుతూ  ఈ విష‌యంలో అంద‌రం క‌లిసి క‌ట్టుగా ఉన్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ఒక‌వేళ చ‌ర్చ‌ల ద్వారా స‌మ‌స్య ప‌రిష్కారం కాకుంటే, అప్పుడు ఏం చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. సైనిక ద‌ళాల‌కు అండ‌గా ఉంటామ‌ని కూడా ఇత‌ర రాజ్య‌స‌భ ఎంపీలు తెలిపారు. 
 
ఐక్య‌త‌, సార్వ‌భౌమ‌త్వం విష‌యంలో దేశం ఒక‌టిగా ఉంటుంద‌ని రాజ్య‌స‌భ విప‌క్ష నేత గులాం న‌బీ ఆజాద్ తెలిపారు. సియాచిన్ సైనిక పోస్టుల‌ను గ‌తంలో చాలా సార్లు తాను విజిట్ చేసిన‌ట్లు ఆయ‌న గుర్తు చేశారు. చైనా ద‌ళాలు త‌మ స్వంత‌ స్థానానికి వెళ్లిపోవాల‌ని ఆయ‌న కోరారు. ఈ అంశంలో రాజ్య‌స‌భ స‌భ్యులంద‌రూ సంఘీభావం ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. 
 
వివిధ పార్టీ ఎంపీలు సంఘీభావం ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్ర‌శంసించారు. నేను మీకు థ్యాంక్స్ చెప్పాల‌ని భావించ‌డం లేదు, ఎందుకంటే మ‌నం అంతా ఒక్క‌టే అన్న సందేశాన్ని వినిపించారని చెప్పారు. 
 
ఎల‌క్ట్రానిక్ మీడియా వ‌ల్ల స‌రిహ‌ద్దుల్లో యుద్ధం లాంటి వాతావ‌ర‌ణం నెల‌కొన్న‌ద‌ని స‌మాజ్‌వాదీ పార్టీ ఎంపీ ర‌వి ప్ర‌కాశ్ వ‌ర్మ ఆరోపించారు. దేశం యావ‌త్ సైనిక ద‌ళాల వెంట ఉన్న‌ద‌ని, అయితే సార్వ‌భౌమ‌త్వం కాపాడుకుంటామ‌ని ర‌క్ష‌ణ మంత్రి చెప్ప‌డంలో అర్థం ఏముంద‌ని ఏకే ఆంటోని ప్ర‌శ్నించారు.