జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ వాయిదా

మొద‌టివిడ‌త‌ జనాభా లెక్క‌ల సేక‌ర‌ణ‌ను కేంద్ర ప్ర‌భుత్వం వాయిదావేసింది. క‌రోనా నేప‌థ్యంలో జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ‌ను వాయిదా వేసిన‌ట్లు హోం మంత్రిత్వ శాఖ‌ రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టించింది. పంజాబ్ కాంగ్రెస్ నాయ‌కుడు పార్తాప్ సింగ్ బ‌జ్వా అడిగిను ప్ర‌శ్న‌కు స‌మాధానంగా జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ వాయిదాప‌డిన‌ట్లు తెలిపింది.

దేశంలో ప్ర‌తి ప‌దేండ్ల‌కొక‌సారి జ‌రిగే జ‌నాభా లెక్క‌ల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సిన మొదటి దశ జ‌న‌గ‌ణ‌న‌ వాయిదా పడినట్లు హోం మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్య‌స‌భకు తెలిపింది.

ఈ కార్య‌క్ర‌మం మ‌ళ్లీ ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంద‌నే విష‌యంపై ఇంకా నిర్ణయం ఇంకా తీసుకోలేద‌ని వెల్ల‌డించింది. క‌రోనా నేప‌థ్యంలో ఇవి ఇప్ప‌ట్లో జరిగే అవకాశం క‌నిపించ‌డంలేద‌ని సంబంధిత అధికారులు తెలిపారు.

జ‌నాభా లెక్క‌ల కోసం దేశ‌వ్యాప్తంగా సుమారు 30 ల‌క్షల మంది అధికారులు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించాల్సి ఉంటుంది. దేశం న‌లుమూలలా ప్ర‌తి ఇళ్లు తిరిగి జ‌నాభాకు సంబంధించిన వివ‌రాల‌ను సేక‌రించాలి. 

అయితే ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో భౌతిక దూరం వంటి నిబంధ‌న‌లు అమ‌ల్లో ఉండ‌టంతో జ‌న‌గ‌ణ‌న ఇప్ప‌ట్లో జ‌రిగే అవ‌కాశాలు లేవ‌ని అధికారులు తెలిపారు.