కరోనాతో బీజేపీ ఎంపీ అశోక్ గస్తీ మృతి 

మహమ్మారి కరోనా కాటుకు మరో ఎంపీ బలైపోయారు. ప్రాణాంతక వైరస్‌ బారిన పడిన రాజ్యసభ సభ్యుడు, కర్ణాటక బీజేపీ నాయకుడు అశోక్‌ గస్తీ (55) కన్నుమూశారు. కరోనాకు చికిత్స పొందుతూ బెంగళూరు ఆస్పత్రిలో మరణించారు. కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 

దీంతో సెప్టెంబరు 2న బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో నేడు తుదిశ్వాస విడిచారు. ఇక గత జూన్‌లో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో అశోక్‌ గస్తీ ఎంపీగా ఎన్నికయ్యారు.   జూలై 22న పదవీ స్వీకార ప్రమాణం చేసిన ఆయన ఒక్కసారి కూడా సమావేశాల్లో పాల్గొనకుండా మరణించడం పట్ల అన్ని వర్గాల నుంచి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

కాగా కర్ణాటకకు చెందిన అశోక్‌ గస్తీ రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)లో చేరి, తదనంతర కాలంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కార్యకర్తగా పనిచేశారు. ఈ క్రమంలో 18 ఏళ్ల వయస్సులోనే బీజేపీలో చేరి, కాషాయ కండువా కప్పుకొన్నారు. రాష్ట్ర యువ మోర్చా అధ్యక్ష పదవి నుండి ‌ నుంచి రాజ్యసభ ఎంపీ వరకు అంచెలంచెలుగా ఎదిగారు. గతంలో కర్ణాటక బీసీ కమిషన్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు.