ట్రయల్స్ దశల్లో మూడు కరోనా వ్యాక్సిన్లు  

దేశంలో మూడు కరోనా వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్ దశల్లో ఉన్నాయని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. కాడిలా, భారత్ బయోటెక్ తొలి దశ ట్రయల్స్ పూర్తి చేశాయని చెప్పారు.  

సిరమ్ ఇన్సిస్ట్యూట్ రెండో దశ బీ3 ట్రయల్స్ పూర్తి చేసిందని, అనుమతుల తర్వాత మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌ను 14 ప్రాంతాల్లో 1500 మంది వలంటీర్లపై చేపడుతుందని ఆయన వివరించారు.

పలు వైరస్ రోగాల నియంత్రణకు ప్లాస్మా థెరపీని వందేండ్లకు పైగా వినియోగిస్తున్నట్లు బలరామ్ భార్గవ తెలిపారు. ప్రస్తుతం కొవిడ్ రోగుల్లోనూ ప్లాస్మా థెరపీని వినియోగిస్తున్నారని, ఈ నేపథ్యంలో దీని పని తీరు గురించి అధ్యయనం జరుగుతున్నదని చెప్పారు. 

అంతర్జాతీయ అధ్యయనంలో భాగంగా మన దేశంలో 14 రాష్ట్రాల్లోని 25 జిల్లాలకు చెందిన 39 ఆసుపత్రుల్లో 468 మంది కరోనా రోగులకు ప్లాస్మా థెరపీని అమలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే మధ్యస్తం నుంచి తీవ్రమైన వ్యాధులను నియంత్రించడంలో, మరణాలను తగ్గించడంలో దీని ప్రభావం అంతగా కనిపించలేదని బలరామ్ భార్గవ వెల్లడించారు.

కాగా  ఐసిఎంఆర్‌తో కలిసి దేశీయ ఔషధ పరిశోధనా సంస్థలు అభివృద్ధి చేసిన రెండు వ్యాక్సిన్లు మొదటిదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాల్లో ఎంతో సురక్షితమని తేలిందని ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్వినీచౌబే తెలిపారు. భారత్ బయోటెక్, క్యాడిలా హెల్త్‌కేర్ రూపొందించిన వ్యాక్సిన్ల గురించి ఆయన ప్రస్తావించారు.

మరోపక్క రష్యా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు సంబంధించి సహకారం అందించేందుకు కూడా చర్చలు జరుపుతున్నట్టు పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికం నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావొచ్చని అంతకు ముందు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్ చెప్పారు.