కేరళ విద్యామంత్రి రాజీనామాలకై నిరసనలు 

కేరళ ఉన్నత విద్యాశాఖ మంత్రి కేటీ జలీల్ రాజీనామా చేయాలంటూ ఆ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్నఆయన తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. 

ఈ మేరకు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా యువ కాంగ్రెస్ కార్యకర్తలు తిరువనంతపురంలోని సచివాలయం ఎదుట మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. మంత్రి జలీల్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మలప్పురం కలెక్టరేట్ ఎదుట మహిళా కార్యకర్తలు నిరసన తెలిపారు. జలీల్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. మరోవైపు కేరళ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కోజికోడ్ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు నీటి ఫిరంగులతో వారిని చెదరగొట్టారు.

గత వారం ఎఫ్ సి ఆర్ ఎ ఉల్లంఘనల ఆరోపణలపై ఈడీ మంత్రిని విచారించింది. బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయి ఉన్న స్వప్న సురేష్ వ్యవహారంలో ఈ మంత్రికి కూడా సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

కాగా, కేరళ సీఎం పినరాయి విజయన్, మంత్రి జలీల్‌ను వెనకేసుకొచ్చారు. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంలో ఆయన ప్రమేయం ఏమీ లేదని తేల్చి చెప్పారు. ఎన్ఐఏ దీనిపై దర్యాప్తు చేస్తున్నదని వాస్తవాలు ఏమిటన్నది తెలుస్తాయని ఆయన తెలిపారు.