ఇక నుంచి నేను బీజేపీ-ఆర్ఎస్ఎస్‌తోనే

ఇక నుంచి తాను బీజేపీ-ఆర్ఎస్ఎస్‌తోనే ఉంటున్న‌ట్లు నేవీ మాజీ అధికారి మ‌ద‌న్‌శ‌ర్మ తెలిపారు. మహారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ శివ‌సేన కార్య‌క‌ర్త‌లు త‌న‌పై దాడి చేసేప్పుడు తాను బీజేపీ-ఆర్ఎస్ఎస్‌తో ఉన్నాన‌ని ఆరోప‌ణ‌లు చేశారు. కాబట్టి ఇప్పుడు నేనే స్వ‌యంగా ప్ర‌క‌టిస్తున్నాను. ఈ రోజు నుంచి తాను బీజేపీ-ఆర్ఎస్ఎస్ స‌భ్యుడ‌న‌ని ప్రకటించారు. 

నేవీ వెట‌ర‌న్ మ‌ద‌న్‌శ‌ర్మ నేడు మ‌హారాష్ర్ట గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారీని క‌లిశారు. రాజ్‌భ‌వ‌న్‌లో గ‌వ‌ర్న‌ర్‌తో భేటీతో సంద‌ర్భంగా ఆయ‌న త‌న‌పై శివ‌సేన కార్య‌క‌ర్త‌లు జ‌రిపిన దాడిని గురించి వివ‌రించారు. త‌గు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా గ‌వ‌ర్న‌ర్‌కు విన్న‌వించారు.

మదన్ శర్మ (65) పై ముంబైలో శివసేన కార్యకర్తలు న‌లుగురు దాడికి పాల్పడ్డారు. సీఎం ఉద్ధవ్‌ను అపహాస్యం చేస్తూ గీసిన కార్టూన్‌ను ఫార్వర్డ్ చేశారంటూ ఆయన నివాసానికి వెళ్లి శివసేన కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘ‌ట‌న‌లో దాడికి పాల్ప‌డ్డ‌వారిని పోలీసులు అరెస్టు చేశారు. వెంట‌నే వీరు బెయిల్‌పై విడుద‌ల‌య్యారు.

దీనిపై మ‌ద‌న్‌శ‌ర్మ స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలను ప‌రిర‌క్షించ‌లేక‌పోతే మహారాష్ట్ర సీఎం ప‌ద‌వీకి ఉద్ధవ్ థాకరే వెంట‌నే రాజీనామా చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. ప్ర‌జ‌లే నిర్ణ‌యిస్తారు ఎవ‌రూ సీఎంగా ఉండాలో  అని పేర్కొన్నారు. త‌న కార్యాల‌యాన్ని కూల్చివేయ‌డంపై బాలీవుడ్ న‌టి కంగ‌నా ర‌నౌత్ సైతం గ‌వ‌ర్న‌ర్ భ‌గ‌త్‌సింగ్ కోశ్యారీని క‌లిసి ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.